అనపర్తి నియోజక వర్గానికి సంబంధించి ఎట్టకేలకు సీట్ విషయంలో స్పష్టత వచ్చింది. నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి బీజేపీలో చేరడంతో ఎన్నో రోజులుగా స్పష్టత లేని విషయానికి తెరదించినట్లు అయ్యింది. అనపర్తి నియోజకవర్గానికి చెందిన నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి బీజేపీలో చేరారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి, ఆంధ్ర ప్రదేశ్ బీజేపీ ఎన్నికల పర్యవేక్షణ సభ్యుడు సిద్ధార్థనాథ్ సింగ్ సమక్షంలో ఆయన కాషాయ కండువా కప్పుకున్నారు. అనపర్తి నుంచి బీజేపీ అభ్యర్థిగా రామకృష్ణా రెడ్డి పోటీ చేయనున్నారు. బీజేపీలో చేరిన మరుక్షణమే రామకృష్ణ రెడ్డికి బి ఫామ్ ఇవ్వడం విశేషం.
టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తులో భాగంగా అనపర్తి సీటు బీజేపీకి కేటాయించారు. బీజేపీకి సీట్ కేటాయించడంతో ఆ స్థానం నుంచి కృష్ణం రాజుకు పార్టీ టికెట్ కేటాయించింది. కూటమిలో ఉన్న రామకృష్ణ రెడ్డి టీడీపీ తరుపున తనకు టికెట్ కేటాయించాలని పట్టుబట్టారు. దీంతో ఈ స్థానంపై ఉత్కంఠ కొనసాగింది. అనపర్తి స్థానం కృష్ణం రాజుకు టికెట్ కేటాయించడంతో దానికి బదులుగా తంబళ్లపల్లి లేదా దెందులూరు సీటును బీజేపీ తీసుకునే అవకాశం ఉందని ప్రచారం జరిగింది. ఇటీవల దీనిని బలం చేస్తూ టీడీపీ అధినేత బి ఫారలు కూడా ఈ రెండు నియోజక వర్గాలుకు చెందిన నేతలకు కూడా అందించలేదు. ఒక సందర్భంలో చంద్రబాబు రామకృష్ణ రెడ్డి ను బీజేపీలోకి వెళ్లి ఆ పార్టీ తరుపున పోటీ చేయాలి అని కూడా కోరారు. దానినే నిజం చేస్తూ రామకృష్ణ రెడ్డి బీజేపీలో జాయిన్ అయ్యి ఆ పార్టీ తరుపున టికెట్ పొందారు. కాగా జరగబోయే ఎన్నికలలో కృష్ణం రాజు రామకృష్ణ రెడ్డికి సహకరిస్తాడో లేదో వేచి చూడాలి.