ఆదివాసీ కళాకారులకు ఆర్థిక అవకాశాలు, సాంస్కృతిక పరిరక్షణ మరియు సమాజ అభివృద్ధి ద్వారా సాధికారత కల్పించేందుకు కరిగర్ కార్యక్రమం ద్వారా అమెజాన్ ఇండియా ఏపీలోని వైజాగ్ అటవీ గిరిజనులతో చేతులు కలిపింది. ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ ద్వారా ప్రపంచ ప్రేక్షకులకు ప్రామాణికమైన హస్తకళా ఉత్పత్తులను అందించడానికి గిరిజన వర్గాల గొప్ప వారసత్వం, హస్తకళను ఉపయోగించుకోవడం ఈ భాగస్వామ్యం లక్ష్యం.
ఈ భాగస్వామ్యం యొక్క ప్రాథమిక లక్ష్యం అమెజాన్‌లో మార్కెటింగ్ ద్వారా గిరిజనులు తయారు చేసే అటవీ ఉత్పత్తులను విక్రయతకి అందించడం, ఆదాయాన్ని పెంచడం తద్వారా గిరిజనులకు ఉపాధి అవకాశాలను సృష్టించడం. అమెజాన్ కరిగర్ కార్యక్రమం గిరిజన సభ్యులకు విస్తృత మార్కెట్ అవకాశాలను కల్పించి, ప్యాకేజింగ్ ఇంకా బ్రాండింగ్‌లో సమగ్ర శిక్షణను అందిస్తుంది, వారి ఉత్పత్తులను ఆన్లైన్లో విక్రయించడానికి వారికి వెసులుబాటు ఇస్తుంది.
ఈ కార్యక్రమంతో విశాఖపట్నం అటవీ ప్రాంతంలోని గిరిజన వాసులకి అందుబాటులో ఈ-కామర్స్ హబ్ ఏర్పాటు చేయబడుతుంది. ప్రైమరీ, సెకండరీ ప్యాకేజింగ్, స్టోరేజ్, డిస్పాచ్ మరియు ఆర్డర్ ప్రాసెసింగ్‌తో సహా వివిధ కార్యకలాపాలకు ఈ హబ్ కీలకమైన కేంద్రంగా పనిచేస్తుంది. ఈ సందర్భంగా, అమెజాన్ ఇండియాలో సెల్లర్ అక్విజిషన్ అండ్ డెవలప్మెంట్ డైరెక్టర్ గౌరవ్ భట్నాగర్ మాట్లాడుతూ, “ఈ భాగస్వామ్యం భారతదేశపు హస్తకళలు, గిరిజన వర్గాల వారి సాంప్రదాయ జ్ఞానాన్ని కాపాడుతూ వారి సామాజిక-ఆర్థిక సాధికారతకు మద్దతునిచ్చే మా నిరంతర ప్రయత్నాలను సూచిస్తుంది, విశాఖ అటవీ గిరిజనులతో చేతులు కలపడం ద్వారా మా కరిగర్ ప్రోగ్రామ్ యొక్క పరిధిని విస్తరించడం ద్వారా, మేము అమెజాన్ మార్కెట్‌ను ప్రామాణికమైన హస్తకళా ఉత్పత్తులతో సుసంపన్నం చేస్తున్నామని తెలిపారు.
ఈ భాగస్వామ్యంపై విశాఖపట్నం జిల్లా అటవీ అధికారి అనంత్ శంకర్ మాట్లాడుతూ, “అమెజాన్ ఇండియాతో మా సహకారం విశాఖపట్నం జిల్లాలోని కంబాలకొండ వన్యప్రాణుల అభయారణ్యం నడిబొడ్డున నివసించే గిరిజన సమాజానికి గణనీయంగా ప్రయోజనం చేకూరుస్తుంది” అన్నారు.