అమలాపురం జిల్లాకు అంబేద్కర్ పేరుని జోడిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అమలాపురంలో అల్లర్లు జరిగిన విషయం విదితమే. ప్రభుత్వం ప్రతిపాదించిన పేరుకు అభ్యంతరాలు ఉంటే ముప్పై రోజుల్లో తెలుపమనగా, అమలాపురం కేంద్రంగా తీవ్ర ఘర్షణలు చెలరేగాయి. ఈ అల్లర్లలో 312 మందిపై కేసులు నమోదయ్యాయి. కొందరు బెయిల్‌పై ఉండగా, మరికొందరు ఇప్పటికీ పరారీలో ఉన్నారు.
2022 మే 12 న ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓ పధకం ప్రకారం ఘర్షణలు చెలరేగాయి. సాక్షాత్తూ కలెక్టరేట్‌పై దాడులకు తెగబడి మరీ విధ్వంసం సృష్టించాయి కొన్ని అల్లరి మూకలు. ఆర్టీసీ బస్సులు, పోలీసు వ్యానులను ధ్వంసం చేయడమే కాక, మంత్రి విశ్వరూప్‌ను, ఆయన భార్యను వారి గృహంలోనే సజీవ దహనం చేయడానికి ఒడిగట్టారు కొందరు. గతంలో ఇక్కడ పనిచేసిన డీఎస్పీ చాకచక్యంగా వ్యవహరించి గాల్లోకి కాల్పులు జరపడంతో దుండగులు చెల్లాచెదురవడంతో మంత్రికి ప్రాణముప్పు తప్పింది. ముమ్మిడివరం ఎమ్మల్యేపై కూడా దాడులు జరగడం, ఈ దాడులు రావులపాలెం వరకూ పాకడంతో రాష్ట్రం ఉలిక్కిపడింది.
విధ్వంసాన్ని అరికట్టే క్రమంలో పోలీసులు కఠినంగా వ్యవహరించి అల్లరి మూకలపై లాఠీ ఛార్జి చేసారు. సుమారు నెలరోజుల పాటు అమలాపురంలో ఇంటర్నెట్ సేవలు కూడా నిలిపివేశారు. నెలరోజుల పోలీసులు పర్యవేక్షణలో ఉన్నాక కానీ అమలాపురంలో సాధారణ జీవనం రాలేదు. ఈ సందర్భంగా దాడులలో పాల్గొన్న వ్యక్తులపై పలు సెక్షన్లతో పాటు యస్సీ యస్టీ కేసులు కూడా పెట్టారు.
ప్రభుత్వం చాలా సీరియస్‌గా పరిగణించవలసిన ఈ ఘటనలో, పోలీసులు క్షుణ్నంగా పరిశోధన చేసి, అనుమానితులు గా ఉన్నవారిపై మాత్రమే కేసులు పెట్టారు. కానీ స్థానిక ప్రజా ప్రతినిధులు మాత్రం దీనిని కూడా రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకున్నారు. పలు ఉద్యమ సంఘాలు అరెస్టుల నేపథ్యంలో ప్రజా ఉద్యమాలను చేపట్టాయి. పలు సామాజిక వర్గాలను లక్ష్యంగా పెట్టుకుని స్థానిక నాయకులు కేసులు పెట్టించారని నిరసించాయి.
ప్రభుత్వం కూడా కేసులు నమోదు వల్ల తనకు నష్టమే అని గుర్తించి, స్థానిక నాయకుల డిమాండ్ ప్రకారం కేసులు ఉపసంహరించుకోవాలని నిర్ణయించుకుంది. న్యాయనరమైన అంశాలు ఇంకా కొలిక్కి రావాలి ప్రభుత్వం కేసులు ఉపసంహరించుకోవడం వల్ల సుమారు 300 మందికి ఈ కేసుల నుండి ఊరట లభించనుంది.