ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. ముఖ్యంగా జనసేన,టీడీపీ, బీజేపీ కూటమి నుండి ఎప్పుడు ఎవరు జారుకుంటారో ఎవరికీ అంతుచిక్కకడం లేదు. ముఖ్యంగా జనసేన పార్టీలో అసంతృప్తులు ఎక్కువగా ఉంటున్నాయి. పార్టీ కోసం సర్వస్వం ధార బోస్తామని, ప్రాణాలు ఇస్తామని చెప్పిన నేతలు కూడా పార్టీలో జరుగుతున్న పరాభవాల కారణంగా పార్టీని వరుసగా వీడుతున్నారు. తాజాగా అమలాపురం జనసేన ఇన్చార్జ్ శెట్టిబత్తుల రాజబాబు పార్టీని వీడుతున్నట్లు ప్రకటించి జనసేన పార్టీకి షాక్ ఇచ్చారు.
వివరాల్లోకి వెళితే జనసేన అమలాపురం ఇన్చార్జ్ గా ఉన్న శెట్టిబత్తుల రాజబాబు జనసేన పార్టీని బలోపేతం చేసేందుకు చాలా కృషి చేశారు. పార్టీ కష్టకాలంలోనూ పార్టీని వీడకుండా జనసేనను అంటిపెట్టుకుని పార్టీని ప్రజలకు చేరువ చేసేందుకు కష్టపడి పనిచేసారు. ఆఖరికి ప్రజా సంకల్ప యాత్ర పేరుతో 100 రోజుల పాదయాత్ర కూడా చేశారు. కానీ ఆయన కష్టాన్ని పవన్ గుర్తించలేదు. జనసేన కేవలం 21 సీట్లకు పరిమితం కావడం, పార్టీ కోసం అంటిపెట్టుకున్న నేతలకు కాకుండా అప్పటికప్పుడు వచ్చిన వలస పార్టీల నేతలకు టికెట్లు ఇవ్వడం వంటి చర్యలతో పలువురు నేతలకు పార్టీకి మధ్య దూరం పెరిగింది. ఈ క్రమంలో అమలాపురం అసెంబ్లీ సీటును టీడీపీ అభ్యర్థి అయితాబత్తుల ఆనందరావుకు కేటాయించడంతో పార్టీ కోసం కష్టపడిన తనకు తగిన గుర్తింపు లేదని భావించిన శెట్టిబత్తుల రాజబాబు జనసేన పార్టీకి గుడ్ బై చెప్పారు.
ఒక్క రాజబాబు మాత్రమే కాకుండా, కాకినాడ మాజీ మేయర్ సరోజ, బొలిశెట్టి సత్యనారాయణ, పోతిన మహేష్, పాఠంశెట్టి సూర్యతేజ, విడివాడ రామచంద్రరావు వంటి నేతలకు జనసేన అధినేత మొండి చెయ్యి చూపించారు. దీంతో ఆయా నేతలు పార్టీ కోసం కష్టపడితే పవన్ కళ్యాణ్ తమను వాడుకుని వదిలేసాడని సన్నిహితుల వద్ద వాపోతున్నారు. మరికొందరు బహిరంగంగానే అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారు. తాజాగా శెట్టిబత్తుల రాజబాబు పార్టీని వీడటం పెద్ద దెబ్బనే చెప్పాలి. దీంతో అమలాపురంలో టీడీపీ అభ్యర్థి గెలవడం కష్టమే అనే అభిప్రాయం రాజకీయవర్గాల్లో వ్యక్తమవుతోంది.