చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇద్దరినీ ఒకే ఫొటోలో చూడగానే గుర్తొచ్చేది 2014 ఎలక్షన్లు. ఏప్రిల్ 30వ తేదీన ఎలక్షన్ ఉండగా, మార్చి 14న పార్టీ పెట్టి పవన్ కళ్యాణ్… రాష్ట్రానికి అనుభవం ఉన్న నాయకుడు అవసరం అని చెప్పి జనసేన మద్దతు టీడీపీకే అని ప్రకటించేశాడు.
ఆ మద్దతు ప్రకటిస్తూ, చంద్రబాబు ఇచ్చే హామీలకు తాను హామీగా ఉంటానని చెప్పాడు. 2016లో అభివృద్ధి అంతా అమరావతిలోనే చేసేస్తున్నారు, రాష్ట్రానికి మంచిది కాదని కొత్తరాగం ఎత్తుకున్నాడు. ఆ తర్వాత అమరావతి రైతులకు చంద్రబాబు అన్యాయం చేస్తున్నాడు అని గొడవ చేశాడు, ఆ తరవాత ప్రభుత్వం నుంచి బయటకి వచ్చేసాడు. తాను హామీగా నిలబడ్డ ఏ హామీ నెరవేర్చలేదు. ఒక్కమాట చెప్పాలంటే మాట తప్పాడు.
మాట తప్పడం పవన్ కళ్యాణ్ కి కొత్త కాదు. 2007లో కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ కి ఇచ్చిన కోటి రూపాయల చెక్కు నుంచి, మత్యకారులకు ఇచ్చిన 50 లక్షల చెక్కు వరకూ ఒక్కటీ కాష్ అవ్వలేదంటే ఆయన నిబద్ధత గురించి అర్థం చేసుకోవచ్చు. లెఫ్ట్ భావాలున్న చెగువేరా తనకు ఆదర్శం అని చెప్పి రైట్ భావజాలం ఉన్న బీజేపీతో కలవడంతో ఆయన స్టాండ్ మీద ఒక క్లారిటీ వస్తుంది.
తాను నిలదొక్కుకునే దిశగా కానీ, సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా కానీ ఒక్క అడుగు కూడా వెయ్యలేదు పవన్ కళ్యాణ్. బీజేపీ టీడీపీకి కొంత ఉపయోగపడ్డాడు. తనవల్లే వాళ్లు గెలిచారు అనే భ్రమలో బతుకుతూ వచ్చాడు. తన అభిమానుల ఆశలను అడియాశలు చేస్తూనే ఉన్నాడు.
చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వేరు కాపురాలు పెట్టి 2019లో దెబ్బతిన్నారు. ఇద్దరూ బతికి బట్టగట్టాలి అంటే కలవాల్సిన సందర్భం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఈలోపు ఎవరి డాంబికాలు వాళ్లు పడుతూ వచ్చారు. చంద్రబాబు అరెస్టుతో ఇద్దరూ కలవడానికి ఒక సందర్భం వచ్చింది, కలిసిపోయారు.
ఈ కలయిక నచ్చని, టీడీపీతో యుద్ధం చేస్తూ వస్తున్న కళ్యాణ్ దిలీప్ సుంకర లాంటి అభిమానులు నొచ్చుకున్నా, వాళ్లని పెద్దగా పట్టించుకోకపోగా వారి మీద వేటు వేశారు.
ఒకప్పుడు బీజేపీ కాళ్లు పట్టుకుని తిరుగుతున్నారని టీడీపీనీ తిట్టిన పవన్ కళ్యాణ్, ఇప్పుడు అదే బీజేపీతో పొత్తులో ఉంటూ బిజెపితో తెగతెంపులు చేసుకొన్న టీడీపీతో కలిసి జగన్ మీద పోరాటానికి సిద్ధం అని స్టేట్మెంట్స్ ఇవ్వడం విచిత్రం
సరే పవన్ కళ్యాణ్ క్రెడిబిలిటీ పక్కన పెడితే ఆయన మీద ప్రజలకున్న నమ్మకం ఎలా ఉందో ఒకసారి చూద్దాం. 2014లో పోటీ చెయ్యలేదు కాబట్టి ఆ ఎలక్షన్లు పట్టించుకోనవసరం లేదు, కాకపోతే టీడీపీకి కొద్దిగా మేలు జరిగింది అనుకోవచ్చు .
2019లో రాపాక తప్ప ఆయనతో సహా పోటీ చేసిన అందరూ ఓడిపోయారు. చాలా చోట్ల డిపాజిట్లు కూడా దక్కలేదు. ఉద్దానం సమస్యని ప్రపంచానికి చెప్పినా కూడా పలాస నియోజకవర్గంలో జనసేనకి కేవలం 6000 ఓట్లు పడ్డాయి అంటే ఆయన మీద ప్రజలకి నమ్మకం ఏ పాటిదో మనం నమ్మవచ్చు.
నాకు మోదీ తెలుసు అని బాహాటంగా చెప్పుకునే పవన్ కళ్యాణ్ బీజేపీతో పొత్తు పెట్టుకుని మొన్న జరిగిన తెలంగాణా ఎన్నికల్లో, ఆంధ్రా ప్రజలు ఎక్కువగా ఉండే ఎనిమిది చోట్ల పోటీ చేస్తే… ఒక్కచోట కూడా డిపాజిట్లు దక్కలేదు. అందులో ఏడు స్థానాల్లో ఇండిపెండెంటుగా పోటీచేసిన బర్రెలక్కకి కంటే తక్కువ ఓట్లు వచ్చాయి. ‘ఇదేనా మన పవన్ కళ్యాణ్ కల్ట్ అంటే?’ అని జనాలు నివ్వెరపోయారు.
మరోపక్క చంద్రబాబు కూడా పతనం అంచులో ఉన్నాడు. ఇచ్చిన హామీలు ఏవీ నెరవేర్చకుండా, అధికార మదంతో పొత్తులో ఉన్న భాగస్వామిని దూరం చేసుకుని, ఆ తర్వాత మళ్ళీ అదే పొత్తుకోసం పాకులాడుతూ ఉన్నాడు. పూర్తి మెజారిటీ ఉన్న పార్టీ, 2019లో 23కి పడిపోయింది. తర్వాత ఒక్కో స్కాము బయట పడుతూ, జైలుకు దగ్గరౌతున్న సమయంలో, నాయకత్వ లేమి కొట్టొచ్చినట్టు కనపడుతోంటే… కార్యకర్తల్లో ఉత్సాహం నింపడం కోసం కోతికి కొబ్బరిచిప్ప దొరికినట్టు మళ్ళీ పవన్ దొరికాడు వీళ్లకి.
అంతా బాగానే జరుగుతున్న సమయంలో తెలంగాణ ఎన్నికల ఫలితాలు వీళ్ల కలయిక మీద నీళ్లు జల్లింది. అప్పటిదాకా బలమైన భాగస్వామి అవుతాడనుకున్న పవన్ కళ్యాణ్ పార్టీ యొక్క తెలంగాణ ఎన్నికల ఫలితాలు చూస్తే టీడీపీకి కూడా గుబులు మొదలై ఉంటుంది. అందుకే ఈ మీటింగ్ అయ్యుండొచ్చు. మొన్నటిదాకా ఇస్తామన్న సీట్లు తగ్గించే అవకాశం లేకపోలేదు.
ఈ నేపథ్యంలో జరిగిన ఈ కలయిక సీట్ల సర్దుబాటు పవన్ ప్రచార రూట్ మేప్ ఇవ్వడం కోసమే తప్ప ప్రజా సంక్షేమం, మేనిఫెస్టో అంశాల గురించి కాదని విశ్లేషకుల మాట.