శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నామని కలెక్టర్ ఎం.హరినారాయణన్ తెలిపారు. శనివారం సచివాలయం నుంచి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారులు ఏర్పాట్లపై కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా హరినారాయణన్ జిల్లాలో చేస్తున్న ఏర్పాట్లను వివరించారు. 445 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించాం. వాటిలో సజావుగా ఎన్నికలు నిర్వహించడానికి చర్యలు తీసుకున్నాం. 1,238 పోలింగ్ కేంద్రాల్లో వెబ్ క్యాస్టింగ్ కు ఏర్పాట్లు చేస్తున్నాం. దీనికి అవసరమైన సిబ్బంది నియామకం, సామగ్రి తరలింపునకు చర్యలు తీసుకున్నాం. తనిఖీలు చేపట్టడానికి 18 ప్రాంతాల్లో చెక్ పోస్టులను ఏర్పాటు చేశాం. నగదు, మద్యం, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా జరగకుండా నిరంతరం వాహనాలను తనిఖీలు చేస్తున్నాం. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ నిబంధనలు పాటించని వారిపై కఠినంగా వ్యవహరిస్తున్నాం. ఇప్పటికే మరో 29మంది కాంట్రాక్టు ఉద్యోగులను తొలగించాం.అలాగే 8 మందిపై కేసులు నమోదు చేయడం జరిగింది. కోడ్ ఉల్లంఘించిన నలుగురు ప్రభుత్వ ఉద్యోగులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం జరిగింది. మరో నలుగురు మీద కేసులు నమోదు చేశాం. ఒకరిని సస్పెండ్ చేశారు. జిల్లాలో సీ విజిల్ యాప్ లో 275 ఫిర్యాదులు వచ్చాయి. వీటన్నింటిని పరిష్కరించాం.ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా రెవెన్యూ అధికారి ఎస్.లవన్న, అదనపు ఎస్పీ ప్రసాదు, తదితరులు పాల్గొన్నారు.