పెందుర్తిలో జనసేన అభ్యర్ధి పంచకర్ల రమేష్ బాబు తరుపున ప్రచారానికి వచ్చిన పవన్ కళ్యాణ్ ప్రత్యర్ధి పార్టీ వైసీపీ మీద పెందుర్తి ఎమ్మెల్యే అదీప్ రాజ్ మీద తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అదీప్ రాజ్ ఒక బచ్చా అంటూనే నియోజకవర్గంలో అందరు అదీప్ రాజ్ అంటే హడలిపోతున్నారంటూ మాట్లాడారు. దీని మీద పవన్ కళ్యాణ్ కు వైసీపీ ఎమ్మెల్యే అదీప్ రాజ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
పెందుర్తిలో దగ్గర దగ్గరగా లక్ష మంది నాకు ఓట్లు వేసి గెలిపించి ఎమ్మెల్యే చేసిన నేనే బచ్చా, ఆఫ్టరాల్ అయితే రెండు చోట్ల ఓడిపోయిన పవన్ కళ్యాణ్ ను ఏమానాలి అంటూ ఎద్దేవా చేశారు.పెందుర్తిలో దాడులను ప్రోత్సహించింది కూటమి పార్టీలయిన జనసేన, టీడీపీలే అని టీడీపీ నేత బండారు సత్యనారాయణ ఇక్కడ మహిళల భూములు లాక్కొని టీడీపీ నేతలు వివస్త్రను చేసి కొట్టింది పవన్ కళ్యాణ్ కు తెలియదా, అలాగే జనసేన నాయకులు బీసీల మీద దాడి చేసింది పవన్ కళ్యాణ్ మరిచిపోయారేమో అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అసలు పవన్ కళ్యాణ్ వెయిట్, హైట్ లో సగం కూడా లేని నన్ను చూసి మీరు, మీ పార్టీ దేనికి భయపడతారు అంటూ ఈ నియోజకవర్గంలో నన్ను చూసి ప్రతి ఒక్కరు అన్న తమ్ముడూ అంటూ ప్రేమగా పిలుస్తారు. ఆ గౌరవాన్ని నేను సంపాదించుకున్నాను. మీ పేరు మీ పార్టీ పేరు చెబితే ప్రజలకు ఏమి గుర్తుకువస్తాయో తెలుసుగా అంటూ చురకలు అంటించారు.
రాక రాక పెందుర్తి వచ్చారు, అలా వచ్చిన మీరు మీ పార్టీ లేదా మీ కూటమి ప్రజలకు ఏమి చేస్తారో చెప్పాలి గానీ వ్యక్తిగత విమర్శలు చెయ్యడం కోసమే సభ పెడితే చీదరింపుగా ఉంటుందని, పవన్ కళ్యాణ్ గతంలో ఇదే జనసేన అభ్యర్ధి పంచకర్ల రమేష్ మీద రోజుకు అక్రమ మైనింగ్ మాఫియా ద్వారా రోజుకీ 6 లక్షలు సంపాదిస్తున్నాడని విమర్శించారని, ఈరోజు దానిలో పవన్ కళ్యాణ్ ఎంత వాటా తీసుకొని టికెట్ ఇచ్చారని ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ ఇప్పటికైనా వ్యక్తిగత విమర్శలు చెయ్యకుండ కేవలం పార్టీ విధి విధానాల మీద మాత్రమే మాట్లాడితే బాగుంటుందని హెచ్చరించారు.