తెలంగాణలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ , బిఆరెస్ పార్టీలు ప్రజలకు ఉచిత వైద్యానికి సంబంధించి ఆరోగ్యశ్రీ హామీలను ఇచ్చాయి. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు విజయం సాధిస్తే, ఆరోగ్యశ్రీ పథకం కింద 10 లక్షల వరకూ ఉచిత వైద్యం అందిస్తామని హామీ ఇస్తే బీఆర్ఎస్ మాత్రం మరో అడుగు ముందుకేసి 15 లక్షల వరకూ ఉచిత వైద్యం అందిస్తామని చెప్పుకొచ్చింది. దేశంలోని ఛత్తీస్ గడ్, రాజస్థాన్, మధ్య ప్రదేశ్ వంటి పలు రాష్ట్రాలు కూడా ఇలాంటి హామీలనే ఇవ్వడం గమనార్హం.
కానీ దేశంలో మరెక్కడా లేని విధంగా జగనన్న ప్రభుత్వం 25 లక్షల వరకూ ఉచితంగా వైయస్సార్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ప్రజల ఆరోగ్యానికి భరోసా ఇస్తుంది. పేద ప్రజలు వైద్యం కోసం ఆస్తులమ్ముకుని అప్పుల పాలయ్యే పరిస్థితులను జగనన్న ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తున్న వైయస్సార్ ఆరోగ్య శ్రీ పథకం సమూలంగా మార్చివేసింది.
25 లక్షల వరకూ ఆరోగ్య భరోసా:
పేద ప్రజలకు పైసా ఖర్చు లేకుండా 25 లక్షల వరకూ వైయస్సార్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఉచితంగా వైద్యం అందింస్తుంది. తీవ్రమైన కాన్సర్ వ్యాధులతో బాధపడే వారి చికిత్సలకు గతంలో ఆరోగ్య శ్రీ పథకంలో ఐదు లక్షల వరకూ పరిమితి ఉండేది. దానిపైన ఎంత ఖర్చైన రోగులే భరించాల్సిన పరిస్థితి ఉండేది. కాగా ప్రతీ పేద వ్యక్తికి నాణ్యమైన వైద్యం అందాలన్న ఉద్దేశ్యంతో ఆ పరిమితిని ఎత్తివేస్తూ జగనన్న ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో అరుదైన వ్యాధులతో బాధపడే పేద ప్రజల ఆరోగ్యానికి భరోసా దొరికినట్లయింది.
బైలేటరల్ కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీ, స్టెమ్ సెల్ ట్రాన్స్ ప్లాంటేషన్, గుండె మార్పిడి లాంటి ఖరీదైన ప్రొసీజర్ల కోసం దాదాపు రూ.1897.86 కోట్ల రూపాయలను ప్రభుత్వం ఖర్చు చేసింది. ఇప్పటివరకూ తీవ్ర వ్యాధులతో బాధపడుతున్న 1,82,733 మంది ఆరోగ్యశ్రీ ద్వారా ఖరీదైన వైద్యాన్ని పొందారు.
ఆరోగ్యశ్రీ పథకాన్ని నిర్లక్ష్యం చేసిన గత ప్రభుత్వం:
గతంలో అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పథకాన్ని నిర్లక్ష్యం చేయడం వల్ల ఆరోగ్యశ్రీ కింద రూ.477.40 కోట్లు, ఈహెచ్ఎస్ కింద రూ.154.1 కోట్లు, మొత్తంగా రూ.631.56 కోట్లను నెలల కొద్దీ పెండింగులో పెట్టడంతో పేద ప్రజలు ఆరోగ్య శ్రీ సేవలందక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దాంతో జగనన్న ప్రభుత్వం గత ప్రభుత్వ బకాయిలను తీర్చడమే కాకుండా ఆరోగ్యశ్రీ పథకం బలోపేతంపై ప్రత్యేక దృష్టి పెట్టింది.
మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం నిరుపేద కుటుంబాలకు మాత్రమే కాకుండా ఏడాదికి ఐదు లక్షల లోపు ఆదాయం ఉన్న ప్రతి ఒక్కరికీ ఆరోగ్యశ్రీ పథకాన్ని వర్తింపజేయడంతో ఎక్కువ మంది లబ్ధిదారులకు ఆరోగ్య భరోసా ఇచ్చినట్లయింది. జగనన్న ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికి కేవలం 1000 రకాల చికిత్సలకు మాత్రమే ఆరోగ్యశ్రీ పథకం పరిమితం కావడంతో అన్నిరకాల చికిత్సలు ప్రతీ పేద వ్యక్తికి అందాలన్న ఉద్దేశ్యంతో చికిత్సల సంఖ్యను 3,225 కి పెంచింది. అంతేకాకుండా వైద్యం ఖర్చు రూ.1000/ దాటితే ఆరోగ్యశ్రీ వర్తించేలా జగనన్న సర్కారు నిబంధనలు మార్చింది. ఆరోగ్యశ్రీ నెట్ వర్క్ ఆసుపత్రులు 2019లో 748 ఉండగా మరిన్ని ఆసుపత్రులను ఆరోగ్యశ్రీ నెట్ వర్క్ లోకి తీసుకురావడంతో వాటి సంఖ్య 2,309 కి పెరిగింది.
ఇతర రాష్ట్రాల్లో ఆరోగ్యశ్రీ సేవలు:
గత ప్రభుత్వ హయాంలో కేవలం ఆంధ్రప్రదేశ్ ఆసుపత్రుల్లో మాత్రమే రోగులకు ఆరోగ్యశ్రీ సేవలు అందేవి. నాణ్యమైన వైద్యంకోసం హైదరాబాద్, బెంగుళూరు, చెన్నై వంటి నగరాల్లో కూడా ఆరోగ్యశ్రీ సేవలు అందేలా జగన్ సర్కారు అవకాశం కల్పించింది. హైదరాబాద్ లో 85, బెంగుళూరులో 35, చెన్నైలో 16 ఆసుపత్రుల్లో మొత్తం 716 ప్రొసీజర్లకు మెరుగైన చికిత్సలు అందుకునే అవకాశం జగన్ ప్రభుత్వం కల్పించింది.
ఆదుకుంటున్న ఆరోగ్య ఆసరా..
ఆరోగ్యశ్రీ పథకం ద్వారా పేద ప్రజలు చికిత్స పొందాక విశ్రాంతి తీసుకునే కాలానికి అండగా నిలుస్తూ రోజుకు కనీసం రూ.225/- గరిష్టంగా నెలకు ఐదు వేల వరకూ జగనన్న ప్రభుత్వం ఆరోగ్య ఆసరా పథకం ద్వారా అందిస్తుంది. రెక్కాడితే కానీ డొక్కాడని పేదలకు ఆరోగ్య ఆసరా పథకం ఒక వరమనే చెప్పాలి. ఆరోగ్య ఆసరా పథకం కింద ఇప్పటివరకూ 25,27,870 మంది రూ.1309.9 కోట్ల రూపాయలను అందుకున్నారు. చికిత్స అనంతరం అనారోగ్యం కారణంగా ఉపాధి పొందలేని పేదవారికి ఆరోగ్య ఆసరా పథకం వెన్నుదన్నుగా నిలుస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.
రెట్టింపు స్థాయిలో వైయస్సార్ ఆరోగ్యశ్రీ సేవలు:
గత ప్రభుత్వం ఐదేళ్ల పాలనా కాలంలో ఆరోగ్యశ్రీ కోసం రూ. 5,171.29 కోట్లు ఖర్చు చేస్తే జగనన్న ప్రభుత్వం దానికి రెట్టింపు స్థాయిలో ఇప్పటివరకూ 11,859.96 కోట్లు ఖర్చు చేసింది. గత ప్రభుత్వ ఐదేళ్ల కాలంలో 22,32,341 మంది ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్స పొందగా ఈ ప్రభుత్వ హయాంలో 53, 02, 816 మంది చికిత్స తీసుకున్నారు.
108,104 కు ఊపిరిలూదిన జగననన్న ప్రభుత్వం:
గత ప్రభుత్వంలో 108, 104 నిర్వహణ కోసం చేసిన ఖర్చు 350 కోట్లు కాగా తిరగగలిగే పరిస్థితి ఉన్న వాహనాలు కేవలం 336 మాత్రమే. కాగా జగనన్న ప్రభుత్వం కొత్త 108 వాహనాలను కొనుగోలు చేసి వాటి సంఖ్యను 768 కి పెంచింది. 104 వాహనాలు గత ప్రభుత్వంలో కేవలం 292 ఉండగా వాటిలో పాత వాటిని తొలగించిన జగనన్న ప్రభుత్వం 910 మొబైల్ క్లినిక్ యూనిట్లు(104లు) కొనుగోలు చేసింది. 108ల నిర్వహణ కోసం గత ప్రభుత్వం 75.67 కోట్లు ఖర్చు చేస్తే జగన్ సర్కార్ ఏకంగా 188.56 కోట్లను ఖర్చు చేస్తుంది. 104 నిర్వహణ కోసం గత ప్రభుత్వం 75 కోట్లను ఖర్చు చేయగా ఈ ప్రభుత్వం 146.16 కోట్లను ఖర్చు చేస్తుంది.
ప్రజలకు మరింత చేరువగా ఆరోగ్యశ్రీ వైద్య సేవలు..
ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఉచిత వైద్యం ఎలా పొందాలో ప్రజలందరికీ అవగాహన కల్పించేలా భారీ ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది జగనన్న ప్రభుత్వం. ముఖ్యమంత్రి జగన్ ఆదేశాల మేరకు ఈనెల 18 నుండి వైద్యారోగ్య శాఖ ఆరోగ్యశ్రీ సేవలపై అవగాహనా కార్యక్రమం చేపట్టనుంది. రూ. 25 లక్షల వరకూ ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత వైద్యం ఎలా పొందాలో గడపగడపకూ వెళ్లి వైద్యారోగ్య సిబ్బంది అవగాహన కల్పిస్తారు.
సరికొత్త ఫీచర్లతో ఆరోగ్యశ్రీ కార్డులు:
రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ లబ్ధిదారులు 1,42,34,464 మంది ఉండగా వీరందరికి అందజేయడానికి సరికొత్త ఆరోగ్యశ్రీ కార్డుల ప్రింటింగ్ ముమ్మురంగా జరుగుతుంది. వైయస్సార్ ఆరోగ్యశ్రీ కార్డులో నూతన ఫీచర్లను జగనన్న ప్రభుత్వం ప్రవేశ పెట్టింది. ప్రతీ కార్డులో లబ్దిదారుని ఫోటోతో పాటు క్యూఆర్ కోడ్ ఉంటుంది. యూనిక్ హెల్త్ ఐడెంటిటీ నంబర్(UHID) ఉంటుంది. కుటుంబ యజమాని పేరు, జిల్లా , మండలం సంబంధిత సెక్రటేరియట్ పేరు కార్డుకు ఒకవైపు ఉండగా, రెసిడెంట్ ఐడీ, కుటుంబ సభ్యుల పేర్లు వెనుకవైపు ఉంటాయి.
రోగి చేయించుకునే వ్యాధి నిర్ధారణ పరీక్షలు, తీసుకుంటున్న వైద్యం, చికిత్సలు, డాక్టర్ సిఫార్సుల సమాచారం మొత్తం యూనిక్ హెల్త్ ఐడెంటిటీ నంబర్(UHID) నిక్షిప్తమై ఉంటుంది. క్యుఆర్ కోడ్ ద్వారా గతంలో రోగి యొక్క ఆరోగ్య పరిస్థితి, తీసుకున్న చికిత్స, వైద్యుల సిఫార్సులు , సూచనలన్ని వెంటనే తెలుసుకునే అవకాశం ఉంది. దీనివల్ల డాక్టర్లకు ఆరోగ్య సిబ్బందికి రోగి ఆరోగ్యంపై వెంటనే అవగాహన వస్తుంది. సంబంధిత రోగికి మెరుగైన వైద్యం అందించడం సులభతరం అవుతుంది.
డిసెంబర్ 18 నుండి అవగాహన కార్యక్రమాలు:
వైయస్సార్ ఆరోగ్యశ్రీ సేవలు ప్రజలకు మెరుగ్గా అందేలా అవగాహన కల్పించేందుకు వైద్యారోగ్య శాఖ సిబ్బందికి నాలుగు సెషన్లలో శిక్షణా కార్యక్రమం నిర్వహించనున్నారు. డిసెంబర్ 18 నుండి ANM లు, MLHP, ఆశా వర్కర్లు అన్ని వివరాలతో కూడిన ఆరోగ్యశ్రీ బ్రోచర్లను తమ సచివలయాల పరిధిలో ఉన్న ప్రతీ ఇంటికి అందించి నూతన ఆరోగ్యశ్రీ కార్డులను పంపిణీ చేస్తారు.
ప్రతీ ఒక్కరూ ఆరోగ్యశ్రీ సేవలను ఉచితంగా ఎలా పొందాలో వివరిస్తూ ఆరోగ్యశ్రీ బ్రోచర్లో ఉన్న అన్ని విషయాలను అర్ధమయ్యేలా వివరిస్తారు. ప్రతీ ఇంటిలో కనీసం ఒక్కరైనా ఆరోగ్యశ్రీ యాప్ ను డౌన్లోడ్ చేసుకునేలా ఒప్పించి ఆ యాప్ ద్వారా ఆరోగ్యశ్రీ సేవలు సులువుగా ఎలా పొందవచ్చో వివరిస్తారు. ఆరోగ్య శ్రీ యాప్ డౌన్లోడ్ చేసే సమయంలో దిశ యాప్ పై కూడా అవగాహన కల్పిస్తారు. ఇప్పటికే 62,75,810 ఫోన్లలో ఆరోగ్యశ్రీ యాప్ ని డౌన్లోడ్ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది,వాలంటీర్ వ్యవస్థ కూడా నిమగ్నమవుతుంది. గృహ సారథులు, ప్రజా ప్రతినిధులు, ఎమ్మెల్యేలు కూడా ఆరోగ్యశ్రీ అవగాహన కార్యక్రమంలో పాల్గొంటారు.