విద్య లేని వాడు వింత పశువు అని నానుడి. కానీ ఉచితంగా అందాల్సిన విద్య కాస్త ధనముంటేనే లభించే స్థితికి చేరిపోయింది. విద్యను వ్యాపార వస్తువుగా చూసిన కొందరు పాలకులు ప్రైవేట్ విద్యాలయాల నుండి తమకు ముట్టే డబ్బు కోసం ప్రభుత్వ విద్యాలయాలను నిర్వీర్యం చేయడమే కాకుండా వాటిని మూసి వేసేందుకు అన్ని విధాలా కృషి చేశారు. దాంతో ప్రైవేట్ పాఠశాలలు ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోవడంతో పాటు ఆయా పాఠశాలల్లో లక్షల రూపాయల ఫీజులు, డొనేషన్లను వసూలు చేయడం పరిపాటిగా మారింది. దాంతో పేద విద్యార్థులకు ప్రైవేట్ పాఠశాలల్లో విద్య అందని ద్రాక్షగా మారిపోయింది. ఈ పరిస్థితిని మార్చడానికి కేంద్ర ప్రభుత్వం విద్యా హక్కు చట్టం 2009 ని రూపొందించింది. ఈ చట్టం ప్రకారం పాఠశాల విద్యను తప్పనిసరి చేయడమే కాకుండా ప్రైవేట్ పాఠశాలల్లో 25% సీట్లను పేద విద్యార్థులకు కేటాయించాలి. కానీ ఈ చట్టాన్ని రాష్ట్రంలోని నాటి పాలకులు పట్టించుకోలేదు.
సీఎంగా బాధ్యతలు చేపట్టగానే జగన్ విద్యారంగంలో సమూల సంస్కరణలకు తెరతీశారు. నాడు నేడు ద్వారా ప్రభుత్వ విద్యాలయాలను ప్రైవేట్ విద్యాలయాలకు ధీటుగా మార్చడమే కాకుండా అన్ని రకాల మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసి ప్రభుత్వ పాఠశాలలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. గత పాలకుల తీరుతో నిర్వీర్యం కాబడ్డ ప్రభుత్వ పాఠశాలలకు సరికొత్త రూపునిచ్చారు. అక్కడితో ఆగకుండా విద్యా హక్కు చట్టం – 2009 పక్కాగా అమలయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు. తద్వారా పేద విద్యార్థులకు ప్రైవేట్, అన్ ఎయిడెడ్ పాఠశాలల్లో 25 శాతం సీట్లు రానున్నాయి.
విద్యా హక్కు చట్టం – 2009 ప్రకారం ప్రతీ ఏడాది ప్రైవేటు పాఠశాలల్లో 25 శాతం సీట్లు పేద విద్యార్థులకు కేటాయించాలి. కానీ గత ప్రభుత్వాలు ఈ చట్టాన్ని పట్టించుకోకపోవడంతో పేద విద్యార్థులకు ప్రైవేట్ పాఠశాలల్లో ప్రవేశాలు దక్కేవి కావు. చట్టం ఉన్నా దాన్ని నెరవేర్చాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది. కానీ గత పాలకులు ఆ దిశగా ప్రయత్నాలు చేయలేదు. ప్రతిభగల ఎందరో పేద విద్యార్థులకు ప్రైవేటు పాఠశాలలవైపు చూసే అవకాశం కూడా ఉండే పరిస్థితి లేదు. కానీ జగన్ రాగానే ఆ పరిస్థితికి చెక్ పెట్టారు. విద్యా హక్కు చట్టం ప్రతీ ప్రైవేట్ పాఠశాలలో అమలయ్యేలా చర్యలు తీసుకున్నారు. సీఎం జగన్ తీసుకున్న చర్యల ఫలితంగా వేల రూపాయల డొనేషన్లు, ఫీజులు బెడద లేకుండా పేద విద్యార్థులకు అత్యున్నత ప్రైవేట్ పాఠశాలల్లో చదువుకునే అవకాశం లభిస్తోంది. అందులో భాగంగా ప్రతీ ఏడాది విద్యా సంవత్సరం ఆరంభానికి ముందే ఒకటో తరగతిలో అర్హులైన పేద విద్యార్థులకు అవకాశం కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ ఇస్తోంది.
గత ఏడాది నుంచే ఈ చట్టం అమల్లోకి తెచ్చిన జగన్ ప్రభుత్వం వచ్చే విద్యా సంవత్సరమైన 2024 – 25 ప్రవేశాల కోసం ఇప్పటికే నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రైవేటు పాఠశాలల్లో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకున్న అర్హులైన విద్యార్థుల జాబితాను విద్యాశాఖ సిద్ధం చేసి ఎంపికై న విద్యార్థులకు ప్రైవేటు పాఠశాలల్లో ప్రవేశాలు కల్పించనుంది. వచ్చే విద్యా సంవత్సరానికి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఈ నెల 23 నుంచి మార్చి 14వ తేదీ వరకు కొనసాగుతుంది. ప్రైవేట్ పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశాల కోసం cse.ap.gov.in పోర్టల్లోకి వెళ్లి రిజిస్ట్రేషన్ ఆఫ్ ఐబీ/ఐసీఎస్ఈ/సీబీఎస్ఈ/స్టేట్ సిలబస్ అమలయ్యే ప్రైవేట్, అన్ఎయిడెడ్ పాఠశాలలను ఎంపిక చేసుకుని దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తుతో పాటు తల్లిదండ్రుల ఆధార్/ఓటరు కార్డు/రేషన్ కార్డు / భూమి హక్కు/ ఉపాధి జాబ్ కార్డు/ పాస్పోర్టు/ డ్రైవింగ్ లైసెన్స్/ విద్యుత్ బిల్లు /రెంటల్ అగ్రిమెంట్ కాపీ జత చేయాలి. మార్చి 20 నుంచి 22 వరకు అర్హులను గుర్తించి ఏప్రిల్ ఒకటో తేదీన లాటరీ ద్వారా మొదటి విడత అర్హుల జాబితా తయారు చేస్తారు. ఏప్రిల్ రెండు నుంచి పదో తేదీ వరకు ఆయా పాఠశాలల్లో విద్యార్థుల అడ్మిషన్లను ఖరారు చేస్తారు. ఏప్రిల్ 15న లాటరీ ద్వారా రెండో విడత జాబితా తయారు చేస్తారు. ఏప్రిల్ 16 నుంచి 23 వరకు ఆయా పాఠశాలల్లో అడ్మిషన్లు ఖరారు చేస్తారు.
గతంలో విద్యను ఒక వ్యాపార వస్తువుగా చూసే పాలకుల వల్ల విద్య హక్కు చట్టం – 2009 ఫలాలు పేద విద్యార్థులకు అందలేదు. కానీవిద్య అందరికీ ఉచితంగా అందాలన్నదే సీఎం జగన్ తాపత్రయం. అందుకే విద్యా హక్కు చట్టం పక్కాగా అమలయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు. ఒకవేళ ఎవరైనా ఉచిత ప్రవేశాలు కల్పించేందుకు నిరాకరిస్తే ఆయా పాఠశాలల యాజమాన్యాలపై చర్యలు తీసుకునేందుకు సీఎం జగన్ వెనుకాడటం లేదు. సీఎం జగన్ తీసుకుంటున్న చర్యల వల్ల రాష్ట్రంలో నాణ్యమైన విద్య కొందరికే అనే స్థాయి నుండి అందరికీ నాణ్యమైన విద్య అందుబాటులోకి వచ్చింది. ఇకపై ప్రభుత్వ పాఠశాలల్లోనే కాదు ప్రైవేట్ పాఠశాలల్లో కూడా విద్య పూర్తిగా ఉచితమే..