ఆంధ్రప్రదేశ్ లో మే 13వ తేదీన జరిగే సార్వత్రిక ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో ఎలాంటి అల్లర్లు జరగకుండా నిర్వహించేలా ఎన్నికల కమిషన్ కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ముకేశ్ కుమార్ మీనా ప్రకటించారు. పోలింగ్ కేంద్రాలు, కౌంటింగ్ సెంటర్లను, స్ట్రాంగ్ రూములను స్వయంగా పరిశీలించి పలు ఆదేశాలు జారీ చేస్తున్నారు. గత ఎన్నికల్లో ఎదురైన అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఈసారి ముందస్తుగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం అని తెలిపారు . సమస్యాత్మక ప్రాంతాల్లో వెబ్ కాస్టింగ్ ద్వారా పోలింగ్ తీరును పరిశీలించేలా ఏర్పాటు చేయడంతో పాటు అదనపు భద్రతా బలగాలను మోహరిస్తున్నారు.
రాష్ట్రంలో సమస్యత్మక పోలింగ్ కేంద్రాలను ఇప్పటికే ఎన్నికల సంఘం గుర్తించింది. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద పూర్తిస్థాయిలో వెబ్ కాస్టింగ్ ద్వారా మొత్తం ఓటింగ్ ప్రక్రియను పరిశీలించారు. పరిశీలన తర్వాత రాష్ట్రంలోని 14 నియోజకవర్గాలపై ఎన్నికల కమిషన్ స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఈ 14 నియోజకవర్గాల్లో పూర్తిస్థాయిలో వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. సమస్యాత్మకంగా ఉండే మరి కొన్ని నియోజక వర్గాలలో పలు పోలింగ్ సెంటర్లలో వెబ్ కాస్టింగ్ పై పరిశీలన చేస్తున్నాం అని తెలిపారు.
రాష్ట్రంలో మాచర్ల, గురజాల, వినుకొండ, పెదకూరపాడు, ఒంగోలు, ఆళ్లగడ్డ, తిరుపతి, చంద్రగిరి, విజయవాడ సెంట్రల్, పుంగనూరు, పలమనేరు, పీలేరు, రాయచోటి, తంబళ్ళపల్లిలో వంద శాతం వెబ్ కాస్టింగ్ చేస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. ఈ నియోజకవర్గాల్లో పోలింగ్ రోజు ఎలాంటి హింసాత్మక ఘటనలు చోటు చేసుకోకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు.