నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డికి రౌడీయిజం చేయడమంటే చాలా ఇష్టం. తన మాట వినాల్సిందేనని, చెప్పింది చేయాలని అధికారులు, పోలీసులను బెదిరించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇక రిపోర్టర్లకు ఫోన్ చేసి చంపేస్తానని మాట్లాడిన ఆడియోలు బయటికొచ్చాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఆయన చేష్టలకు అధిష్టానం ఎప్పటికప్పుడు అడ్డుకట్ట వేస్తూ వచ్చింది. ఓ మహిళా ఎంపీడీఓపై దౌర్జన్యం చేసిన విషయంలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ ఎమ్మెల్యేపై సీరియస్ అయ్యారు. అధికార పార్టీనే అయినా సరే.. ఆమె ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. వైఎస్సార్సీపీ నుంచి సస్పెండ్ అయ్యి తెలుగుదేశంలో చేరాక శ్రీధర్‌రెడ్డికి రౌడీయిజం చేసేందుకు లైసెన్స్ లభించినట్లయింది.
టీడీపీ నాయకుడు పొంగూరు నారాయణ తన విద్యాసంస్థలకు వాహనాల కొనుగోలు విషయంలో ప్రభుత్వానికి పన్ను ఎగ్గొట్టేందుకు అక్రమ మార్గాలను ఎంచుకున్నారు. దీనిపై ఫిర్యాదులు అందడంతో పోలీసులు, ఇతర శాఖల అధికారులు ఆ కేసులో సంబంధం ఉన్న వ్యక్తుల ఇళ్లలో సోమవారం సోదాలు చేపట్టారు. లెక్కల్లోకి రాని సొమ్మును సుమారు రూ.1.81 కోట్లు, కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. నారాయణ మనిషి అయిన మాజీ జెడ్పీటీసీ సభ్యురాలు విజేతారెడ్డి ఇంట్లో పోలీసులు తనిఖీలకు వెళ్లినప్పుడు శ్రీధర్‌రెడ్డి రంగప్రవేశం చేసి నానా హంగామా చేశారు. పన్ను ఎగవేత విషయమని చెబుతున్నా రాజకీయ రంగు పులిమేందుకు ప్రయత్నించారు. అధికారులను వారి పని చేయకుండా అడ్డుకున్నారు. అంతటితో ఆగకుండా సాయంత్రం నారాయణ వర్గంతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు.
ఇందులో శ్రీధర్‌రెడ్డి మాట్లాడుతూ పవర్లోకి వచ్చేది టీడీపీనే.. అధికారులు, పోలీసుల అంతు చూస్తానంటూ ఊగిపోయారు. నారాయణ అక్రమార్కుడని టీడీపీ నాయకులకు బాగా తెలుసు. అందుకే ఈ విషయంపై చాలామంది సీనియర్లు నోరెత్తలేదు. కానీ చంద్రబాబు వద్ద మార్కులు కొట్టేసేందుకు, నారాయణ వద్ద డబ్బు వసూలు చేసుకునేందుకు తనలోకి రౌడీని నిద్రలేపారు శ్రీధర్‌రెడ్డి. మాజీ మంత్రికి వత్తాసుగా పోలీస్ ఉన్నతాధికారులపై నోటికొచ్చింది మాట్లాడారు. సభలు, సమావేశాల్లో అధికారులు, పోలీసులను తిట్టడం చంద్రబాబు అలవాటే. అలాంటి వ్యక్తి దగ్గర చేరిన శ్రీధర్‌రెడ్డి మంచి వాఖ్యాలు చెబుతారనుకుంటే పొరపాటే. అధికారంలోకి వచ్చేస్తున్నాం.. అందరి సంగతి చెబుతామని కొద్దిరోజులుగా విర్రవీగుతున్నారు.
ఇదే సమయంలో పాత విషయాలను గుర్తు చేసుకోవాలి. గతంలో శ్రీధర్‌రెడ్డి తెలుగుదేశం విద్యార్థి, యువత విభాగానికి చెందిన నాయకులను దారుణంగా కొట్టించినట్లు ఆరోపణలున్నాయి. దీనిపై టీడీపీ నేతలందరూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన జీతాలిచ్చి రౌడీలను పెంచి పోషిస్తున్నారని విమర్శించారు.
కోటంరెడ్డిని వైఎస్సార్సీపీ సస్పెండ్ చేసిన సమయంలో తన వెంట నడవలేదని ఓ కార్పొరేటర్‌ను భయభ్రాంతులకు గురి చేశారు. ఫోన్ చేసి బూతులు తిట్టి చంపేస్తానన్నారు. ఈ విషయంలో ఎమ్మెల్యేపై పోలీస్ కేసు కూడా నమోదైంది. అరాచకాలకు కేరాఫ్ అడ్రస్ శ్రీధర్‌రెడ్డి అని నాడు గగ్గోలు పెట్టిన తెలుగు తమ్ముళ్లకు ఇప్పుడు ఆయన వ్యవహారశైలి బాగా నచ్చేసింది. రౌడీలా ప్రవరిస్తూ అధికారులను బెదిరిస్తున్నాడని స్పషంగా తెలుస్తున్నా.. దానికి భయం లేని మనిషి, ధైర్యవంతుడని పేర్లు పెడుతున్నారు. పాపం ఆయన సంగతి వారికి పూర్తిగా తెలిసినట్లు లేదు. ఎమ్మెల్యేకి నెల్లూరు కమలహాసన్ ఒకప్పుడు తమ్ముళ్లే ముద్దు పెట్టారు. దానిని సార్ధకం చేసుకునే పనిలో ఆయన ఉన్నాడు.