మొన్న జనవరి 16న బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ రిలీజ్ చేసిన గణాంకాలు భారతదేశం లో కొత్తగా వివిధ రాష్ట్రాల నుండి నమోదు అయిన పెట్టుబడిదారుల సంఖ్య దేశీయ మార్కెట్ యొక్క విస్తృతిని పెంచుతున్నట్లుగా తెలుపుతున్నాయి…
సాధారణం గా స్టాక్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టుటకు ఆసక్తి చూపడం అనేది ఆ దేశం యొక్క ఆర్ధిక అభివృద్ధి స్థాయిని నిర్ణయిస్తుందని మైక్రో ఎకనామిస్ట్ లు వ్యాఖ్యానిస్తుంటారు. దానికి ఎన్నో కారణాలున్నప్పటికీ ముఖ్యంగా చెప్పుకోదగినవి పొదుపు స్థాయి, పెట్టుబడి స్థాయి పెరిగితే ఆ ఆర్ధిక వ్యవస్థలో మిగులు ఉన్నట్టు గా కొంతవరకు భావించవచ్చు. గత 30 ఏళ్లుగా అనగా ఆర్థిక సంస్కరణల అనంతరం దేశంలో పొదుపు రేటు పెరిగినంతగా పెట్టుబడి రేటు పెరగడం లేదు, ఇది దేశ ఆర్ధిక వ్యవస్థకు కొంత అవరోధం అని భావిస్తున్నారు. ప్రతీ ఏడాది పెట్టుబడి రేటు టార్గెట్ అందుకోలేకపోవడం కూడా ఆర్ధిక నిపుణులకు విధితమే.
అయితే గత కొన్నేళ్లుగా దేశం లో కొత్తగా స్టాక్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టే వారి సంఖ్య గణనీయంగా పెరగడం దేశ ఆర్ధిక వ్యవస్థకు మరింత ఊతం చేకూరుస్తుంది. పెట్టుబడులకై విదేశాలపై గణనీయంగా ఆధారపడటం భారత్ యొక్క అతిపెద్ద సమస్య. అయితే దేశీయ పెట్టుబడులు మరింత పెరగడం వలన విదేశాల పెట్టుబడులపై ఆధారపడటం తగ్గుతుంది. తాజాగా IMF నివేదిక లో ప్రపంచ మార్కెట్ లలో కెల్లా భారత్ సగటున 7.3 శాతం వృద్ధి రేటుతో దూసుకుపోతూ కేవలం 2-3% మాత్రమే నమోదు చేస్తున్న యూరోపియన్ యూనియన్ దేశాల కన్నా, నెగటివ్ వృద్ధి రేటు కనబరుస్తున్న అమెరికా, చైనా ల కన్నా ఎంతో ముందు ఉండటం భారత అభివృద్ధి యొక్క వేగాన్ని తెలియజేస్తుంది. ఈ BSE గణాంకాలు కూడా వాటిని దృవపరుస్తున్నట్లుగా కనపడుతుంది.
అయితే ఇక్కడ ఆశ్చర్యపరిచే మరో అంశం, ఆంధ్రప్రదేశ్ యొక్క గణాంకాలు, సాధారణంగా ఈ స్టాక్ మార్కెట్ లో పెట్టుబడి లాంటి తదితర అంశాలు పట్టణాలలో, నగరాల్లో నివసించే అనగా పట్టణ ఆర్ధిక వ్యవస్థ కలిగిన రాష్ట్రాల్లో అధికంగా ఉండటం సహజమే, ఉదాహరణకు మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలు. కానీ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, అందులోనూ వ్యవసాయ ప్రధాన ఆర్థిక వ్యవస్థ అయిన ఏపీ లో పెద్ద రాష్ట్రాలతో పోటా పోటీగా దాదాపు 62 లక్షల నూతన రిజస్ట్రేషన్లు జరగడం అందులోనూ తెలంగాణనూ వెనక్కి నెట్టడం ఒకింత ఆశ్చర్యం. గతేడాది కూడా ఈ గణాంకాలు ఏపీ విషయంలో మెరుగ్గానే ఉన్నాయి (55 లక్షలు) ఈ ఏడాది మరింత పుంజుకుంది. నూతనంగా ఏర్పడ్డా, జనాభా పరంగా చిన్నదైనా, ఈ స్థాయి లో నమోదు అవ్వడం, ప్రజల యొక్క పెట్టుబడి స్థాయి పెరగడం, తమ పొదుపుని ప్రత్యామ్నాయ ఆదాయ వనరులపై నిలపడం గమనిస్తే ఏపీ ఆర్థిక వ్యవస్థ గతంలో కంటే చాలా మెరుగైందని చెప్పకనే చెప్తున్నాయి…