2014 సంవత్సరం మలయాళ చిత్రాలకు బాగా కలిసొచ్చిందనే చెప్పాలి. ప్రేమలు, మంజుమ్మల్ బాయ్స్, భ్రమయుగం,గోట్ లైఫ్ – ఆడు జీవితం లాంటి హిట్స్ తో అన్ని భాషల ఇండస్ట్రీలను ఆకర్షించిన మాలీవుడ్ చిత్రాలు తాజాగా మరో యాక్షన్ కామెడీ చిత్రంతో వార్తల్లోకి వచ్చింది. గతేడాది రోమాంచం అనే హారర్ కామెడీతో సాలిడ్ హిట్ కొట్టిన జీతూ మాధవన్ దర్శకత్వంలో రూపొందిన ఆవేశం అనే చిత్రం తొలిరోజు నుండే బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది.
ఫహద్ ఫాజిల్ హీరోగా నటించిన ఆవేశం చిత్రం బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకున్న నేపథ్యంలో పలువురు నిర్మాతల దృష్టి ఈ చిత్రంపై పడింది. కాగా ఇప్పటికే మలయాళంలో రూపొందిన ప్రేమలు, మంజుమ్మల్ బాయ్స్, భ్రమయుగం,గోట్ లైఫ్ – ఆడు జీవితం తెలుగులో కూడా డబ్ అయి మంచి పేరు తెచ్చుకున్న విషయం తెలిసిందే. వీటిలో ప్రేమలు చిత్రాన్ని ఫహద్ ఫాజిల్ నిర్మించి సాలిడ్ హిట్ కొట్టగా తాజాగా ఆవేశం చిత్రానికి కూడా నిర్మాణ భాగస్వామిగా వ్యవరించడం విశేషం.
మలయాళంలో మంచి నటుడిగా పేరున్న ఫహాద్ ఫాజిల్ పుష్ప చిత్రంతో తెలుగులో కూడా మంచి పేరు తెచ్చుకున్న విషయం తెలిసిందే. తెలుగు వారికి పరిచయం లేని నటులున్న మలయాళం చిత్రాలే ఇక్కడ బ్లాక్ బస్టర్స్ అవుతున్న నేపథ్యంలో ఆవేశం కూడా తెలుగులో ఎవరో ఒక బడా నిర్మాత డబ్ చేసే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఎలాగు తెలుగులో కూడా ఫహాద్ ఫాజిల్ కి మంచి గుర్తింపు ఉంది కాబట్టి తెలుగులో రిలీజ్ చేసి లాభాలు గడించాలనే ఆలోచనను కొట్టి పారేయలేము. ఒకవేళ థియేటర్లలో డబ్బింగ్ వెర్షన్ రిలీజ్ కాకున్నా ఓటిటి వెర్షన్ ని డబ్ చేసి రిలీజ్ చేసే అవకాశం ఉంది.