విజయ దేవరకొండకి గత కొంతకాలంగా కలిసి రావడం లేదనే చెప్పాలి. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన లైగర్ డిజాస్టర్ కావడం, ఖుషి యావరేజ్ గా నిలవడం అనంతరం దిల్ రాజు నిర్మాణంలో పరశురామ్ దర్శకత్వం వహించిన ది ఫ్యామిలీ స్టార్ విడుదల కావడానికి ముందే విపరీతమైన నెగెటివిటీని మూటగట్టుకోవడం దానికి తోడు సినిమా రిలీజ్ అయ్యాక నెగెటివ్ రివ్యూలు రావడంతో కలెక్షన్స్ కొల్లగొట్టడంలో విఫలమైంది. దాంతో రౌడీ విజయ్ దేవరకొండ కెరీర్లో మరో డిజాస్టర్ గా ది ఫ్యామిలీ స్టార్ నిలిచింది. తమ సినిమాపై కావాలనే నెగెటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారని దిల్ రాజు సంచలన ఆరోపణలు కూడా చేశారు.
ఇదిలా ఉంటే ది ఫ్యామిలీ స్టార్ ఏప్రిల్ 26 నుండి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. థియేటర్లలో ప్లాప్ అయిన ఈ మూవీ ఓటిటిలో అదరగొడుతుండడం విశేషం. ప్రైమ్ లో ప్రస్తుతం ఈ చిత్రం దేశ వ్యాప్తంగా నంబర్ 1 స్థానంలో ట్రెండ్ అవుతుంది. ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో మాత్రమే స్ట్రీమ్ అవుతున్న ఈ చిత్రం, హిందీ భాషలో స్ట్రీమ్ కాకుండానే నంబర్ 1 గా నిలబడటం విశేషమనే చెప్పాలి. దీంతో థియేటర్లలో విడుదలైనప్పుడు వచ్చిన నెగెటివిటీ కావాలనే క్రియేట్ చేసారా అనే అనుమానాలు కలుగుతున్నాయి.
కాగా ది ఫామిలీ స్టార్ చిత్రంలో విజయ్ దేవరకొండ సరసన మృణాళిని ఠాకూర్ జంటగా నటించగా గోపి సుందర్ సంగీతం అందించారు. దిల్ రాజు నిర్మాణంలో పరశురామ్ దర్శకత్వంలో ది ఫ్యామిలీ స్టార్ రూపొందింది. మరోవైపు విజయ్ దేవరకొండతో దిల్ రాజు మరో చిత్రాన్ని నిర్మించనున్నారని వార్తలు వస్తున్నాయి.