2022లో మలయాళంలో రిలీజ్ అయిన జయ జయ జయ జయహే చిత్రం ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. పరిమిత వ్యయంతో తెరకెక్కిన ఈ మూవీ దాదాపు 45 కోట్ల రూపాయల కలెక్షన్స్ కొల్లగొట్టి హాట్ టాపిక్ గా మారింది. టామ్ & జెర్రీ లా ఉండే భార్య భర్తల కథతో రూపొందిన ఈ చిత్రానికి విపిన్ దాస్ దర్శకత్వం వహించగా బాసిల్ జోసెఫ్ మరియు దర్శన రాజేంద్రన్ హీరో హీరోయిన్లుగా నటించారు.
కాగా ఈ మలయాళ చిత్ర రీమేక్‌లో డైరెక్టర్ తరుణ్ భాస్కర్ హీరోగా నటించనున్నట్లు ప్రచారం జరుగుతుండగా ఆ చిత్రంలోనే హీరోయిన్ గా నటించిన దర్శన రాజేంద్రన్ రీమేక్ లో కూడా నటించనున్నట్లు సమాచారం. ఒకవేళ ఆమె ఈ చిత్రంలో నటిస్తే ఇదే టాలీవుడ్ డెబ్యూ ఫిల్మ్ గా మారనుంది. కానీ ‘జయ జయ జయ జయహే’ ఓటిటి హక్కులను డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సొంతం చేసుకుంది. తెలుగు డబ్బింగ్ వెర్షన్ కూడా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో అందుబాటులో ఉండటం విశేషం. ఇప్పటికే తెలుగు ప్రేక్షకులలో చాలామంది ఈ చిత్రాన్ని చూసి ఉన్న నేపథ్యంలో తరుణ్ భాస్కర్ హీరోగా చేస్తే వర్కౌట్ అవుతుందా అని సినీ విశ్లేషకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
మాతృక ‘జయ జయ జయ జయహే’లో ఉన్న ఆత్మ రీమేక్ చేసి చెడగొట్టవద్దని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనా తెలుగులో అందుబాటులో ఉన్న చిత్రాన్ని రీమేక్ చేయడానికి పూనుకోవడం సాహసమనే చెప్పాలి. గతంలో తెలుగులో అందుబాటులో ఉన్న లూసిఫర్ చిత్రాన్ని మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ పేరుతో రీమేక్ చేసి చేతులు కాల్చుకున్న విషయం తెలిసిందే. పవన్ కళ్యాణ్ కూడా తెలుగులో వచ్చిన వీరుడొక్కడే చిత్రాన్ని కాటమరాయుడు పేరుతో రీమేక్ చేసి చేతులు కాల్చుకున్నారు. మరి తరుణ్ భాస్కర్ ‘జయ జయ జయ జయహే’తో హిట్ కొడతాడో లేదో వేచి చూడాలి. త్వరలో ఈ మూవీ అఫీషియల్ అనౌన్స్మెంట్ రానున్నట్లు సమాచారం.