లోకనాయకుడు కమల్ హాసన్ కి విక్రమ్ ముందు వరకూ సరైన హిట్ లేదు. స్వీయ నిర్మాణంలో లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహించిన విక్రమ్ కమల్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. తాజాగా కమల్ హాసన్ పై నిర్మాతల మండలికి ఫిర్యాదు అందింది. ఈ పిర్యాదు చేసింది ప్రముఖ నిర్మాత, దర్శకుడు లింగుస్వామి కావడం గమనార్హం. లింగుస్వామితో పాటు సుభాష్ చంద్రబోస్ కూడా లోకనాయకుడిపై పిర్యాదు చేశారు. దీనికంతటికి కారణం 2015 లో తెరకెక్కిన ఉత్తమ విలన్ చిత్రం కావడం విశేషం.
లింగుసామి మరియు సుభాష్ చంద్రబోస్ నిర్మాతలుగా రమేష్ అరవింద్ దర్శకత్వంలో ఉత్తమ విలన్ చిత్రం రూపొందింది. కానీ సినిమా డిజాస్టర్ కావడంతో రూ. 30 కోట్ల బడ్జెట్తో లింగుస్వామి, సుభాష్ చంద్రబోస్ లకు మరో సినిమా చేసి ఉత్తమ విలన్ సినిమా నష్టాన్ని భర్తీ చేస్తానని కమల్ హామీ ఇచ్చినట్లు తెలుస్తుంది. కానీ గత తొమ్మిదేళ్లుగా తమతో సినిమా చేయకుండా కమల్ హాసన్ తప్పించుకుంటున్నారని లింగుస్వామి, రమేష్ సుభాష్ చంద్రబోస్ నిర్మాతల మండలిని ఆశ్రయించారు. మరి నిర్మాతల మండలి కమల్ హాసన్ పై ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి.
ఇదిలా ఉంటే ప్రస్తుతం కమల్ నటించిన భారతీయుడు 2 విడుదలకు సిద్ధంగా ఉంది. శంకర్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం భారతీయుడు చిత్రానికి సీక్వెల్ కావడం గమనార్హం. థగ్ లైఫ్ తో పాటు కల్కి 2898 ADలో ఓ ప్రత్యేక పాత్రలో కమల్ హాసన్ నటిస్తున్నారు. ప్రస్తుతం కమల్ హాసన్ పై చెలరేగిన ఈ వివాదం ఎలా సద్దుమణుగుతుందో వేచి చూడాలి.