ప్రముఖ కోలివుడ్ యాక్టర్ డేనియల్ బాలాజీ (48) గుండెపోటుతో మృతి చెందారు. శుక్రవారం అర్ధరాత్రి ఛాతినొప్పితో బాధపడుతున్న డేనియల్ బాలాజీని చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ శుక్రవారం తుదిశ్వాస విడిచారు. కాగా ఆయన మరణవార్త తెలుసుకున్న పలువురు తమిళ,తెలుగు సినీ ప్రముఖులు దిగ్భ్రాంతికి గురయ్యారు. తమిళ చిత్రాలతోనే కాకుండా తెలుగు చిత్రాల్లో కూడా డేనియల్ బాలాజీ నటించడం గమనార్హం.
టీవీ సీరియళ్ళలో నటించడం ద్వారా నటన మొదలుపెట్టిన డేనియల్ బాలాజీ తమిళంతో పాటు తెలుగు, మలయాళం, కన్నడలో మొత్తం 50కి పైగా సినిమాల్లో నటించారు. చిత్తి అనే తమిళ సీరియల్తో గుర్తింపు తెచ్చుకున్న బాలాజీ తరువాత సినిమాల్లో బిజీ అయ్యారు. రాధిక ప్రధాన పాత్రలో నటించిన చిత్తి సీరియల్ తెలుగులో ‘పిన్ని’గా డబ్ అయి మంచి విజయం సాధించింది. అనంతరం ఏప్రిల్ మదాతిల్ అనే సినిమాతో వెండితెర అరంగేట్రం చేసిన డేనియల్ బాలాజీకి,గౌతమ్ మీనన్ దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా నటించిన రాఘవన్ సినిమాతో మంచి పేరు వచ్చింది. సైకో డాక్టర్ గా రాఘవన్ సినిమాలో మంచి నటన కనబరచడంతో వరుసగా వడ చెన్నై, కాక్క కాక్క, వేట్టైయాడు విళయాడు లాంటి సినిమాల్లో వరుస అవకాశాలు వచ్చాయి.
తమిళంలోనే కాకుండా తెలుగు సినిమాల్లో కూడా డేనియల్ బాలాజీ నటించాడు. 2004లో వచ్చిన ఎన్టీఆర్ ‘సాంబ’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన బాలాజీ అనంతరం వెంకటేష్ హీరోగా వచ్చిన ఘర్షణ సినిమాలో నటించారు. సాహసం శ్వాసగా సాగిపో, టక్ జగదీష్ చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. చిన్న వయసులోనే డేనియల్ బాలాజీ మృతి చెందడంతో పలువురు సెలబ్రెటీలు ఆయన మృతికి సంతాపం వ్యక్తం చేస్తున్నారు.