కేవలం మూడు వారాల్లోనే విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఫ్యామిలీ స్టార్ ఓటీటీలో అడుగుపెట్టింది. ఎన్నో అంచనాల మధ్య ఏప్రిల్ 5న విడుదలైన ఫ్యామిలీ స్టార్ డిజాస్టర్ కావడంతో కేవలం మూడు వారాల్లోనే ఓటిటి గడప తొక్కడం విశేషం. విజయ్ దేవరకొండ, మృణాళిని ఠాకూర్ జంటగా నటించిన ఈ చిత్రానికి గీత గోవిందం ఫేమ్ పరశురామ్ దర్శకత్వం వహించగా స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మించారు. గోపి సుందర్ ఈ సినిమాకి సంగీతం అందించారు.
కాగా గత కొంతకాలంగా విజయ్ దేవరకొండ నటించిన చిత్రాలన్నీ బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. ఈసారి గట్టిగ హిట్టు కొట్టాలని తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఇచ్చిన పరశురామ్ తో మరోసారి జట్టు కట్టాడు విజయ్. కుటుంబ కథ చిత్రంగా తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమై బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. సినిమాపై కావాలని కొంతమంది నెగెటివిటీ స్ప్రెడ్ చేశారని అందుకే ఫ్యామిలీ స్టార్ కలెక్షన్లు పడిపోయాయంటూ మూవీ టీమ్ ఆరోపించడం గమనార్హం.
ప్రస్తుతం ఫ్యామిలీ స్టార్ మూవీ తెలుగు, తమిళ భాషల్లో అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. థియేటర్లలో ఆకట్టుకోలేకపోయిన ఫ్యామిలీ స్టార్ ని ఓటిటి లో ఆదరిస్తారా లేదా అనేది కొన్ని రోజుల్లో క్లారిటీ వస్తుంది. ప్రస్తుతం విజయ్ దేవరకొండ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో నటించబోతున్నారు. ప్రీ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ మూవీలో పాటలు ఉండవని ఇండస్ట్రీ వర్గాలు పేర్కొంటున్నాయి. సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ చిత్ర పూర్తి వివరాలు ఇంకా బయటకు రావాల్సి ఉంది.