ఐఎమ్డీబీ టాప్ 250 ఉత్తమ చిత్రాల జాబితాలో 50వ స్థానాన్ని కైవసం చేసుకున్న ఏకైక భారతీయ చిత్రంగా చరిత్ర సృష్టించిన 12th ఫెయిల్ సినిమా నేటినుండి ప్రాంతీయ భాషలైన ఇప్పుడు తమిళ, తెలుగు భాషల్లోనూ స్ట్రీమింగ్ కానుంది. ఐపీఎస్ అధికారి మనోజ్ కుమార్ జీవిత కథ ఆధారంగా రూపొందిన 12th ఫెయిల్ విమర్శకుల ప్రశంసలు పొందింది. యువతలో స్ఫూర్తి నింపే సినిమాగా 12th ఫెయిల్ గుర్తింపు పొందింది. కాగా ఈ చిత్రం డిస్నీ ప్లస్ హాట్స్టార్ లో డిసెంబర్ 29 నుంచే స్ట్రీమింగ్ అవుతూ వచ్చింది. కానీ తెలుగు భాషలో స్ట్రీమింగ్ లేకపోవడం వల్ల తెలుగు ప్రేక్షకులు నిరాశ చెందారు. కానీ నేటి నుండి డిస్నీ ప్లస్ హాట్స్టార్ లో తెలుగు, తమిళ భాషల్లో అందుబాటులోకి రావడంతో తెలుగు ప్రేక్షకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
జీ స్టూడియోస్ నిర్మించిన ఈ సినిమాకు విధు వినోద్ చోప్రా దర్శకత్వం వహించారు. విక్రాంత్ మస్సే- మేధా శంకర్ ప్రధాన పాత్రలు పోషించగా ప్రియాంషు ఛటర్జీ, సంజయ్ బిష్ణోయ్, హరీష్ ఖన్నాలు కీలక పాత్రలు పోషించారు. శంతను మోయిత్రా సంగీతాన్ని అందించారు. ఇప్పటికే ఫిల్మ్ ఫేర్ అవార్డుల్లో ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ స్క్రీన్ ప్లే, ఉత్తమ ఎడిటింగ్, ఉత్తమ నటుడు(క్రిటిక్స్) కేటగిరీల్లో అవార్డులు కొల్లగొట్టిన 12th ఫెయిల్ చిత్రం ఆస్కార్ బరిలో కూడా సత్తా చాటేందుకు పోటీ పడనుంది. ఇప్పటికే ఐఎమ్డీబీలో 9.2 రేటింగ్ సాధించి ఉత్తమ భారతీయ చిత్రంగా నిలిచింది.