ముఖ్యమంత్రి జగన్ ఎన్నికల ఫలితాల అనంతరం మళ్ళీ అధికారం చేపట్టిన మరుక్షణం నుంచే రాష్ట్ర పాలన మొత్తం విశాఖ కేంద్రంగా కొనసాగుతుందని ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఆయన ప్రమాణ స్వీకార వేడుకకు సైతం విశాఖలో పనులు ప్రారభిస్తునట్టు, జూన్ 9న ఆయన ప్రమాణ స్వీకారమహోత్సవం ఉంటుందని ఇప్పటికే ఆ పార్టీ వర్గాలు ప్రకటించారు. పరిపాలన రాజధానిగా మారనున్న విశాఖ నగరంలోనే వైసీపీ రాష్ట్ర కార్యాలయ నిర్మాణాన్ని సైతం ఆ పార్టీ నేతలు గతంలోనే ప్రారంభించారు.
విశాఖలోని ఎండాడ లా కాలేజీ రోడ్డు, పనోరమ హిల్స్ వద్ద 2 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించనున్న వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నూతన కార్యాలయానికి 2022 డిసెంబర్ నెలలోనే భూమి పూజ చేసి పనులు ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ కార్యాలయ నిర్మాణ పనులు పూర్తై ప్రారంభానికి సిద్దమైనట్టు తెలుస్తుంది. ఈ మేరకు నిర్మాణం పూర్తిచేసుకున్న కార్యాలయానికి సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇదిలా ఉంటే ఈ కార్యాలయం ప్రారంభోత్సవం ఎప్పుడు ఉండబోతుందనే అంశానికి సంబంధించిన వివరాలు మాత్రం ప్రస్తుతానికి గోప్యంగానే ఉన్నాయి. జగన్ ముఖ్యమంత్రిగా రెండో సారి బాధ్యతలు చేపట్టిన తరువాత ఈ కార్యాలయం ప్రారంభం ఉండవచ్చనే ఊహాగానాలు ఉన్నాయి.