మారుతున్న ప్రపంచ అవసరాల కోసం, మెట్రోపాలిటన్ నగరాల్లో ఎదురవుతున్న అధిక జనాభా, కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరుగుదలను దృష్టిలో ఉంచుకుని టైర్ 2 నగరాలలో టెక్ హబ్ ల విస్తరణ అవకాశాలపై నాస్కాం నివేదిక ఇచ్చింది. మెట్రోపాలిటన్ నగరాలతో పోలిస్తే ఈ టైర్ 2 నగరాల్లో ఉన్న అవకాశాల గురించి, ఉత్పత్తి వ్యయం అదుపు గురుంచి ఈ నివేదిక ప్రస్తావించింది.
భారతదేశంలో అభివృద్ధి చెందుతున్న టెక్ హబ్‌లలో విశాఖపట్నం, తిరుపతి మరియు విజయవాడ వంటి నగరాల్లో మెచ్యూర్ హబ్‌ల కంటే ఈ అభివృద్ధి చెందుతున్న నగరాల్లో టాలెంట్ ఖర్చులు 25-30% తక్కువగా ఉంటాయి, రియల్ ఎస్టేట్ రెంటల్స్‌లో 50% ఖర్చు ఆదా అవుతుంది. ఇంకా, 60% గ్రాడ్యుయేట్లు ఈ చిన్న నగరాలకు చెందినవారని నివేదిక పేర్కొంది.
విపరీతమైన జనాభా ఒత్తిడి, కాంక్రీట్ జంగిల్స్ లా మారుతున్న పట్టణాల వల్ల నీటి ఎద్దడి, పట్టణ వరదల కారణంగా ఏటా భారత జీడీపీ లో 2% పైగా నష్టం వాటిల్లుతుంది. ఈ ప్రభావం టెక్ కంపెనీ లపై కూడా అధికంగానే ఉంటుంది. దీనికి ప్రత్యామ్నాయం గా అభివృద్ధి వికేంద్రీకరణ లో భాగంగా పెద్ద నగరాల స్థానం లో ద్వితీయ శ్రేణి నగరాల్లో టెక్ కంపెనీల వ్యవస్థాపన జరిపితే కాస్ట్ కటింగ్ తో పాటు, మూలధన వ్యయం కూడా తగ్గుతుందని నాస్కాం వెల్లడించిన రిపోర్ట్ ను బట్టి అర్థం చేసుకోవచ్చు.
ఈ అభిప్రాయానికి అణుగుణంగానే దిగ్గజ IT కంపెనీ లు టైర్ 2 నగరాల్లో తమ కార్యకలాపాలను విస్తరించడం ఈ మధ్య కాలం లో అధికమయ్యింది. ఈ టైర్ 2 నగరాలు ముంబై, గుజరాత్ తర్వాత అత్యధికంగా ఉంది ఆంధ్రప్రదేశ్ లోనే. దక్షిణ భారత దేశంలో IT సెక్టార్ లో అధికంగా ఉద్యోగులు ఉన్నది తెలుగు రాష్ట్రాల్లోనే కాబట్టి ఈ తరహా మార్పు ఏపీ లో అనుకూల ప్రభావాన్ని చూపనుంది. ఇప్పటికే ఇన్ఫోసిస్ వంటి దిగ్గజ కంపెనీ లు తమ కార్యకలాపాలను వైజాగ్ లో ప్రారంభించాయి. రానున్న రోజుల్లో మరిన్ని సంస్థలు వైజాగ్, విజయవాడ, తిరుపతి లాంటి నగరాల్లో తమ కార్యకలాపాలను విస్తరిస్తాయని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు..