స్టూడియో అంటే ఎలా ఉండాలి, రింగ్ రోడ్డులకు ఆనుకుని వేల ఎకరాల్లో రాజగురువు రాజసౌధంలా ఉండాలి. మాహిష్మతి సామ్రాజ్యపు గ్రాఫిక్స్ తలదన్నేలా ఉండాలి.
నగరం నడిబొడ్డున పద్మాలయ స్టూడియోలా పదుల ఎకరాల్లో ఉండాలి. అదీ కనీసం రామక్రిష్ణ స్టూడియోలా ఉండాలి.
అసలు బంజారా హిల్స్ మెయిన్ రోడ్డులో దర్శకేంద్రునికి ల్యాండ్ రాయించడంలో ఉన్న మజా తెలుసా..!
ఇస్తే గిస్తే దేవతల రాజధానిగా ప్రకటించిన అమరావతి పక్కన ఇవ్వాలి ఎక్కడో రాయలసీమలో మారమూల మదనపల్లె పక్కన హార్స్ లీ హిల్స్ అది కూడా రెండెకరాల్లో మినీ స్టూడియో అంట.
అసలు రాయలసీమకు ఆ అర్హత ఉందా..?
అవును నిజమే కేవీరెడ్డి, చిత్తూరు నాగయ్య వంటి వారి తొలినాటి తెలుగు సినిమాను తమ భూజాలపై మోశారు. అయితే మాత్రం రాయలసీమకు స్టూడియో ఇస్తారా..!
అవును తెలుగు హీరోల్లో ఎవరికి ప్లాఫులు పలకరిస్తున్నా హిట్స్ కావాలంటే ఆ రెడ్డో ఈ రెడ్డో అంటూ ఇదే రాయలసీమకు వస్తారు. అయితే మాత్రం రాయలసీమకు స్టూడియో ఇస్తారా..!
ఈ మధ్య పాన్ ఇండియా అంటూ మొదలుపెట్టిన కమల్ హాసన్ క్లాసిక్ మూవీ భారతీయుడు – 2 రాయలసీమలోని చిత్తూరు జిల్లా ఫించా డ్యాం చుట్టుపక్కల జరిగింది. అయితే మాత్రం రాయలసీమకు స్టూడియో ఇస్తారా..!
విక్రమ్, పా రంజిత్, జ్ఞానవేల్ రాజా వంటి హేమాహేమీల వంటి కాంబినేషన్ లో వస్తున్న తంగలాన్ సినిమా షూటింగ్ అన్నమయ్య డ్యాం పరిసరాల్లో జరిగింది. అయితే మాత్రం రాయలసీమకు స్టూడియో ఇస్తారా..!
ప్రభాస్, కమల్ హాసన్, ఫహద్ ఫాజిల్, రజనీకాంత్ వంటి ప్రముఖులు అదే రాయలసీమలోని గండికోట షూటింగ్ కు వచ్చి వెళ్తుంటారు. అయితే మాత్రం రాయలసీమకు స్టూడియో ఇస్తారా..!
ఇవనే కాదు కడప, చిత్తూరు, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో నిత్యం ఎన్నెన్నో చిన్న షూటింగ్ లు ఏవో జరుగుతూనే ఉంటాయి.
మీ దృష్టిలో సినిమా అంటే హీరోనో, ప్రొడ్యూసరో, డైరెక్టరో ఉండచ్చు, కానీ సినిమా అంటే వాళ్లు తాగే నీళ్లనుంచి, సేదతీరే హోటల్ వరకూ ప్రతిదీ స్థానికంగా ఉపాధి అవకాశాలను, ఆర్థిక లాభాలను పెంచేదే. అలాంటిది వర్గ ద్వేషంతో మీరు చల్లుతున్న విషం ఆ వ్యక్తుల మీదకంటే మొత్తం రాయలసీమ సమాజం మీద పడుతుందని గ్రహింపుకు రావడంలేదా?
2021 రాయలసీమ ఔత్సాహిక యువకుడు ఒక సినిమా తీశాడు . షూటింగ్ 100 కు 100% కడప జిల్లా బద్వేల్ పరిసర ప్రాంతాల్లోనే జరిగింది. ఎడిటింగ్, డబ్బింగ్, మిక్సింగ్ ఇతర పోస్ట్ ప్రొడక్షన్ కోసం తట్ట బుట్టా సర్ది హైదరాబాద్ కు పరిగెత్తాల్సి వచ్చింది .
2023 లో కూడా షార్ట్ ఫిల్మ్ ఒకటి చేశారు. ఆ షూటింగ్ కూడా కడప పరిసరాల్లోనే జరిగింది. మళ్లీ సేమ్, పోస్ట్ ప్రొడక్షన్ కోసం హైదరాబాద్ వైపే చూడాల్సి వచ్చింది.
ఇలాంటి స్టూడియో రాయలసీమలో అందుబాటులో ఉండుంటే ఆ పనులు కూడా ఇక్కడే చేసుండేవాళ్లు కాదా?
సినిమా అంటే హైదరాబాద్ కే పరిగెత్తాల్సిన అవసరం లేదు, మన అవసరాలను మనమే తీర్చుకుందాం అంటూ అతనొక అడుగు ముందుకేశాడు. అతనికి ప్రోత్సాహం ఇవ్వకపోయినా పరవాలేదు గానీ మీ మీ సామాజిక, రాజకీయ వర్గ ప్రయోజనాల కోసం అతని అడుగులు తడబడేలా, అతని ఉత్సాహం కరిగిపోయేలా బంధనాలు వెయ్యడం ఎంతవరకు సబబు?
అలాగని అతను కేవలం తన స్వప్రయోజనాల కోసం ఉన్నట్టుండి ఆకాశంనుంచి ఊడిపడ్డట్టు ఇప్పకిప్పుడు స్టూడియో కడతాను అనట్లేదే, పదైదేళ్లకు పైగా తెలుగు ఇండస్ట్రీలో ఉంటూ దర్శకుడిగా తను తీసిన పాఠశాల, యాత్ర, సైతాన్, సేవ్ టైగర్స్, యాత్ర – 2 వంటి సినిమాల్లో మెజార్టీ భాగం ఇదే రాయలసీమలో తీశాడు. స్థానికంగా మనకున్న వనరులను అందిపుచ్చుకుని ఇప్పుడు మనమేసే తొలి అడుగులే రేపటి రోజున మరిన్ని అడుగులకు ప్రోత్సాహమిస్తుందనే గొప్ప ఉద్దేశ్యాన్ని మీరు నీరుగారుస్తున్నట్టే.
కేవలం మీకు నచ్చని వ్యక్తి మీద
మీకు నచ్చని కులం వ్యక్తి సినిమా తీశారని
మీకు నచ్చని రాజకీయ పార్టీకి మేలుచేస్తుందనే అభద్రతాభావంతో ఇంతలా విషం చిమ్మాలా?
పార్టీ అంటే మీ అనుకూల పార్టీ
రాష్ట్రమంటే అమరావతి మాత్రమే కాదు.
మీరు చేస్తున్న దుష్ప్రచారం, మీ రాజకీయ వైరం వ్యక్తులను దాటి, ప్రాంతం మీద కూడా విషం చల్లుతోందని గ్రహించండి.