టోఫెల్ అనగా టెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ యాజ్ ఏ ఫారిన్ లాంగ్వేజ్. ఈ టోఫెల్ ఎవరైనా విద్యార్థులు ఉన్నత విద్య కోసం అమెరికా, కెనడా, యునైటెడ్ కింగ్డమ్, జర్మనీ వంటి దేశాలకి వెళ్లే సమయంలో విద్యార్థుల యొక్క ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీని పరీక్షించే టెస్ట్. సాధారణంగా మన దేశంలో మాట్లాడే ఇంగ్లీష్ కు, విదేశాల్లో మాట్లాడే ఇంగ్లీష్ భాష వేరుగా ఉంటుంది. విదేశాల్లో మాట్లాడే ఇంగ్లీష్ ఇక్కడి విద్యార్థులకు అర్థమవుతుందా లేదా అని భావించి నిర్వహించే టెస్ట్ యే టోఫెల్. ఈ టెస్ట్ లో ఇప్పటికీ చాలామంది విద్యార్థులు ఫెయిల్ అవుతున్నారు. దీనిని దృష్టిలో పెట్టుకొని విద్యార్థులకు చిన్నప్పటి నుంచే ఈ టెస్ట్ పైన అవగాహన, ట్రైనింగ్ ఇస్తే అడ్డంకులు ఉండవని జగన్ సర్కార్ భావించి పాఠశాల స్థాయి నుంచి టోఫెల్ విద్యను అందుబాటులోకి తీసుకొని వచ్చింది. 2023-24 ఏడాదికి గాను గత వారం రోజులుగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు టోఫెల్ పరీక్షను నిర్వహిస్తున్నారు.
ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో చదువుతున్న 6 నుంచి 9 తరగతుల విద్యార్థులకు శుక్రవారం నిర్వహించిన టోఫెల్ జూనియర్ ప్రిపరేటరీ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. మొత్తం జూనియర్ విభాగంలో 16,52,142 మందికి గాను 11,74,338 మంది విద్యార్థులు హాజరైనట్టు ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ డాక్టర్ ప్రతాప్ రెడ్డి తెలిపారు. కాగా, 3, 4, 5 తరగతుల విద్యార్థులకు ఈనెల 10వ తేదీన నిర్వహించిన టోఫెల్ ప్రైమరీ పరీక్షను 4,17,879 మంది విద్యార్థులు రాశారు. ఈటీఎస్ సంస్థ పంపించిన ప్రశ్నపత్రాలు, ఆడియో క్లిప్పుల ఆధారంగా విద్యార్థులకు రీడింగ్, లిజనింగ్ విభాగాల్లో పరీక్ష నిర్వహించారు. ప్రైమరీ, జూనియర్ విభాగాల్లో 21 లక్షల మంది విద్యార్థులకు టోఫెల్ నిర్వహించాలని కార్యాచరణ రూపొందించగా, 90 శాతం మంది హాజరైనట్టు అధికారులు ప్రకటించారు. ఈ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు అమెరికాకు చెందిన ఈటీఎస్ సంస్థ సర్టిఫికెట్లను ప్రదానం చేస్తుంది.
కాగా ఇటీవల మూడు నుంచి 5వ తరగతి చదువుతున్న విద్యార్థులకు టోఫెల్ పరీక్ష నిర్వహించారు.రాష్ట్రంలో మూడో తరగతి నుంచి ఐదో తరగతి చదువుతున్న విద్యార్థులకు రాష్ట్ర వ్యాప్తంగా టోఫెల్ పరీక్ష విజయవంతంగా నిర్వహించినట్లు ప్రతాప్ రెడ్డి తెలిపారు. సెమీ జూనియర్ విభాగంలో 13,104 పాఠశాలల్లో 4,17,879 మంది విద్యార్థులు టోఫెల్ పరీక్షకు హాజరయ్యారని తెలిపారు. ప్రధానంగా గ్రామీణ, మారుమూల గిరిజన ప్రాంతాల్లోని పాఠశాలల విద్యార్థులు టోఫెల్ పరీక్షకు హాజరవడం ఆశ్చర్యానికి గురి చేసిందని తెలిపారు.
ఈ సందర్భంగా టోఫెల్ పరీక్షకు హాజరైన విద్యార్థులు మాట్లాడుతూ ప్రాథమిక స్థాయి నుండే స్పోకెన్ ఇంగ్లీష్ నైపుణ్యాలను పెంపొందించుకునే అవకాశం దొరకడం తమ అదృష్టంగా భావిస్తున్నామన్నారు. టోఫెల్ పరీక్షలు రాయడం గొప్ప అనుభూతిని కలగజేసిందన్నారు. టోఫెల్ సర్టిఫికేట్ అందుకునేందుకు ఉత్సుకతతో ఎదురు చూస్తున్నామన్నారు.