ఆ ఊరంతా సందడిగా ఉంది. సంక్రాంతి పండుగ సందర్భంగా ఇతర ప్రాంతాల్లో ఉంటున్న ఊరోళ్లు రావడంతో పండగ వాతావరణం నెలకొంది. నగరాలు, పట్టణాల్లో ఉంటునోళ్లు పల్లెబాట పట్టారు. విద్యుద్దీప కాంతులతో ప్రతి వీధి వెలిగిపోతోంది.
వేరే రాష్ట్రంలో ఉద్యోగాలు చేస్తున్న అనిల్, కృష్ణ ఉత్సవాల కోసం ఆ ఉదయమే ఇంటికొచ్చారు. ఇద్దరూ మెయిన్ రోడ్డులోని టీ అంగడి దగ్గర కలిశారు. జీవితం ఎలా సాగుతుందో మాట్లాడుకుంటున్నారు. వారికి సమీపంలో కూర్చొన్న ఓ పెద్దాయన మరొకరితో ఆనందంగా చెబుతున్నాడు.
‘అబ్బోడా.. నిన్నటి ఉదయమే వలంటీరమ్మాయి పింఛన్ డబ్బు తెచ్చిచ్చినాది రా.. ఈరోజు పోయి మందు బిళ్లలు కొనుక్కోవాల. నువ్వొస్తావా?’
పెద్దాయన మాటలు విన్న అవతలి వ్యక్తి గతాన్ని గుర్తు చేసుకున్నాడు.
‘మూడేళ్ల క్రితం పింఛన్ తీస్కోడానికి ముసలోళ్లు ఎన్ని ఇబ్బందులు పడ్డారు మావా. ఇప్పుడంటే ఒకటో తారీకునే∙వలంటీర్లు తెల్లారి నుంచే ఇంటికొచ్చి ఇచ్చేసి పోతున్నారు. ఎవరి దాకో ఎందుకు నీ సంగతి చెప్పు. జన్మభూమి కమిటీల చుట్టూ ఇద్దరం లెక్కలేనన్ని సార్లు తిరిగితిమి. వాల్లకి కనికరమే లేకపాయే.. ఇప్పుడు ఆ పార్టీ వాడు.. ఈ పార్టీ వాడని లేదు. సచివాలయంకి పోయి అర్జీ ఇస్తే చాలు. నీకవకాశం ఉంటే యెంటనే ఇచ్చేస్తండారు.’
వారి మాటలు విన్న కృష్ణ ‘ఊరు చాలా మారిపోయింది బావా.. మూడేళ్ల క్రితం ఇక్కడి రావాలంటేనే చిరాకొచ్చేది. ఇప్పుడు ఉత్సాహంగా వస్తున్నా. ప్రతిసారి ఏదో ఒక మార్పు కనిపిస్తోంది.’ అన్నాడు.
‘అవును బావా.. ఇందాక మన హైస్కూల్‌ని బయట్నుంచి చూసినా. ఎంత బాగుంది రా..’ అనిల్ కృష్ణతో మురిసిపోతూ చెప్పాడు.
‘అవునా.. ఉదయం ఇంట్లో మా తమ్ముడు అదే చెప్పాడు. స్కూల్‌ని అద్భుతంగా చేశారు.. ఓసారి పోయి చూడన్నా అన్నాడు.’
ఇద్దరూ హైస్కూల్‌కి వెళ్లారు.
‘ఒకప్పుడు ఈ గ్రౌండ్ పిచ్చిమొక్కలు.. ఆడాడ గుంతల్తో ఉండేది. బర్రెలు.. కుక్కలు తిరగతాంటే మనం చాలా ఇబ్బంది పడ్డాం. అప్పుడప్పుడు పాములు కనిపించేవి. మొత్తం మార్చేసినారు కదా బావా.. ప్రహరీ కట్టి గేటు పెట్టారు.’ కృష్ణ చెప్తుండగా అనిల్ ఆనందంగా పరిసరాలను చూస్తూ ‘అవున్రా బావా. ఒకప్పుడు టాయ్‌లెట్స్‌కి తలుపుండేవి కాదు. ఇప్పుడు చూడు నీటిగా చేశారు. రూమ్స్ సరిపోక చాలాసార్లు చెట్ల కింద కూర్చోపెట్టి పాఠాలు చెప్పారు. ప్రస్తుతం ఫర్నిచర్ ఉంది. హాయిగా ఫ్యాన్ కిందుండి చదువుకుంటున్నారు. ఇంగ్లిష్ మీడియం, కంప్యూటర్ ల్యాబ్, లైబ్రరీ, రోజుకో మెనూతో మంచి ఫుడ్.. అమ్మఒడి కింద ప్రతేడు డబ్బు.. లక్ అంటే ఇప్పటి స్టూడెంట్స్దే రా బావా..’ అన్నాడు.
కాసేపటికి ఇద్దరూ సచివాలయం వైపు వెళ్లారు. ఓ యువకుడు అనిల్‌ని పలకరించాడు.
‘ఏరా చిన్నా.. ఇక్కడేం చేస్తున్నావ్..’
‘హయ్యర్ స్టడీస్ కోసం మొన్న ఇన్‌కం సర్టిఫికెట్‌కి అప్లై చేశా. అది తీసుకుందామని వచ్చినా అన్నా..’
‘అంత ఈజీగా వచ్చేస్తుందా ఇప్పుడు?.. మా టైంలో అయితే తాసీల్దార్ ఆఫీస్ చుట్టూ తిరిగి తిరిగి విసుగొచ్చేది.’
‘ఇప్పుడదంతా ఏం లేదన్నా.. సచివాలయం పెట్టాక సర్టిఫికెట్లు తొందర్గా వచ్చేస్తున్నాయ్.’
‘సూపర్ రా.. నీ హయ్యర్ స్టడీస్‌కి బ్యాంక్ లోన్ పెట్టారా?’
‘లేదన్నా.. విద్యాదీవెన, వసతి దీవెన ఉన్నాయ్‌గా.. నో ప్రాబ్లమ్.’
‘బాగా చదువుకోరా..’ అని కృష్ణ, అనిల్ ఆ యువకుడికి చెప్పి సచివాలయంలో కాసేపు తిరిగారు.
అక్కడ 500కు పైగా సేవలందుతున్నాయి. వాటి వివరాలతో కూడిన బోర్డులను చూశారు. సిబ్బంది ప్రజలకు సమాధానం చెప్పే తీరు వారిని ఆకట్టుకుంది.
బయటికొచ్చాక రైతు భరోసా కేంద్రం వద్ద కొంతమంది గుమిగూడారు. వాళ్లలో అనిల్ బంధువున్నాడు.
‘ఏం బాబాయ్ బాగున్నావా?, ఇక్కడేం చేస్తున్నావ్..’
‘నాకేం రా అబ్బాయ్.. చాలా బాగుండా.. సబ్సిడీ కింద పనిముట్లు ఇస్తామంటే తీస్కోడానికొచ్చా.’
‘అవునా.. ఒకే ఒకే.. వ్యవసాయం ఎలా పోతాంది బాబాయ్?’
‘బాగుంది రా.. మూడేళ్ల నుంచి వర్షాలు బాగా పడతన్నాయ్. నీళ్లకి ఇబ్బంది లేదు. గవర్నమెంటోళ్లే పెట్టుబడి కింద డబ్బిస్తన్నారు. ఈ ఆర్బీకేలో మంచి విత్తనాలు, ఎరువులు తీస్కోవచ్చు. ఎప్పుడు ఫోన్ చేసినా అధికారులొచ్చి పొలం చూస్తాండారు.’ వాళ్లు మాట్లాడుకుంటుండగా జెడ్పీటీసీ సభ్యురాలు అక్కడికొచ్చింది.
‘ఏమక్కా ఎట్లున్నావ్. జెడ్పీటీసీ నవ్వేనని చెప్పారు.’ కృష్ణ అడిగాడు.
‘అవునబ్బాయ్. ఇది జనరల్ సీటు. బీసీ అయిన నాకు అవకాశమిచ్చినారు. ఈ తూరి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు చానామంది పదవుల్లో ఉండారు. అందులోనూ లేడిస్ ఎక్కువ. మనూరి పక్కనున్న టౌన్లో మున్సిపాలిటీ చైర్మన్ కూడా ఆడ బిడ్డే.
‘గ్రేట్ అక్కా.. చాలా పెద్ద మార్పిది. లేడిస్ కోసం చాలా స్కీంలు పెట్టారంట కదా..’
‘హా.. ఆసరా, చేయూత, సున్నా వడ్డీ.. ఇలా చాలా ఉండాయ్.’
‘ఊళ్లో రోడ్లు బాగా వేసినారక్కా.. ఒకప్పుడు మట్టి రోడ్ల మీద తిరగలేక సచ్చేటోళ్లం.’
‘మనూర్లోనే కాదు.. చాలాచోట్ల వేసినారు. మూడేళ్ల క్రితం వేరు. ఇప్పుడు పరిస్థిలేరు.’
అనిల్, కృష్ణ కాసేపు ఆమెతో మాట్లాడి వేపచెట్టు అరుగు దగ్గరికి బయలుదేరారు. అలా వెళ్తుండగా కాలనీలో క్లాస్మేట్ రత్నం వాళ్ల అమ్మ కనిపించింది.
‘అమ్మా బాగుండావా..?’
‘ఓరి మీరంట్రా. ఎప్పుడొచ్చారు. ఎట్లుండారు.’
‘సూపరున్నావమ్మా. మీ వాడు రేపొస్తానన్నాడు. ఇంతకీ రామన్నెక్కడ?’
‘ఇళ్లు కడతన్నాం రా.. ఆడికి పోయిండు.’
‘అవునా.. గుడిసె నుంచి కొత్తింటికి మారుతున్నారన్నమాట. ఎంతైతాంది?’
‘మనదేం లేదురా.. గవర్నమెంటోల్లు నా పేరు మీద స్థలం ఇచ్చినారు. ఆల్లే కట్టిస్తన్నారు. మనూల్లో ఇల్లు లేనోందరికి స్థలమిచ్చి కట్టిస్తాండారులే. అది కొత్త ఊరనుకోండి. మట్టి తోలి, యిధి లైట్లేసి బాగా చేసినారు.’ ఆమె సంతోషంగా చెప్పింది.
‘మీ వాడు ఎప్పుటికైనా ఇల్లు కట్టాలనేవోడు. ఆ కల గవర్నమెంటే తీరుస్తాంది.’ అన్నాడు అనిల్. కాసేపటికి అక్కడికి రామన్న వచ్చాడు.
‘ఏందయ్యా.. అంత మెల్ల నడుస్తున్నావ్.. ఆరోగ్యం ఎట్లుంది?’ కృష్ణ అడిగాడు.
‘మీకు చెప్పడం మర్చిపోయినా రా.. ఆయనకి నెల కితం గుండెపోటు వొచ్చింది. ఈడ హాస్పటల్లో చూపిస్తే తొందర్గా ఆపరేషను చేయాలంట్రి. రత్నం, నేను సిటీకి తీస్కోపోయి చేపించినాం.’
‘ఓపన్ హార్టు సర్జెరీ అంట.’ రామన్న చిన్నగా చెప్పాడు.
‘అవునా చాలా ఖర్చై ఉంటాదే..’
‘లేదు.. ఆరోగ్యశ్రీ కింద ఫ్రీగా చేసి పంపిండ్రు. మన్ది రూపాయి ఖర్సు కాలే. మళ్లా కూడా తొమ్మిదిన్నరేయి నా బ్యాంక్ అకౌంట్లో వేసినారు. చాలా పెద్ద ఆస్పత్రి రా అబ్బాయ్. బాగా చుస్కున్నారు. మూడేళ్ల క్రితం అదే ఆపరేషను మా బంధువులాయన చేయించుకున్నాడు. అప్పుడు ఆరోగ్యశ్రీ రాలే. అప్పు చేసి ఆస్పత్రి నుంచి బయటపడ్డాడు. ఇప్పుడు మాత్రం చానామంది ప్రీగా ఆపరేషన్లు చేయించుకుంటన్నారు. ’ రామన్న భార్య వైపు చూస్తూ కన్నీళ్లు కారుస్తూ చెప్పాడు. అనిల్, కృష్ణ కాసేపు వాళ్లతో మాట్లాడి అక్కడ్నుంచి బయలుదేరారు.
బాగుపడిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని దాటుకుని, కళకళలాడుతున్న పాలకేంద్రం దగ్గర కాసేపు ఆగి ఆడోళ్లతో మాట్లాడి.. నిండుగా ఉన్న చెరువు నీటిని చూసి అరుగు కాడికి చేరారు.
వేపచెట్టు నీడన అరుగుపై కృష్ణ, అనిల్ తల కింద చేతులు పెట్టుకుని పడుకున్నారు.
‘ఊరు ఇంతలా మారిపోద్దని నేనెప్పుడూ అనుకోలే బావా..’
‘కరోనా వల్ల అంతా ఇబ్బందులున్నా గవర్నమెంట్ ఎక్కడా వెనక్కి తగ్గలేదు రా.. చేసి చూపించారు.’
‘చదువుకునేటోళ్లకి, లేడిస్‌కి, రైతుల్కి.. ఇంకా చాలామందికి ఆర్థికంగా అండగా నిలిచారు. నిలుస్తున్నారు.’ ఇద్దరూ మాట్లాడుకుంటున్నారు. అంతలో హైస్కూల్‌కి చెందిన పిల్లలు ఇంగ్లిష్‌లో మాట్లాడుతూ అరుగు దగ్గరికి చేరారు.