ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ పొత్తులు ఎత్తులతో రాజకీయాలు హీటెక్కాయి. ఇప్పటికే జనసేన టీడీపీ పొత్తు ఖాయం కాగా, మొన్నటివరకు ఉన్న బీజేపీ జనసేన పొత్తు ఇప్పుడు ఉందోలేదో ఎవరికి అంతుపట్టని ప్రశ్నగా మారింది. మొదటినుండి సెంట్రల్ బీజేపీ పెద్దలు ఎట్టి పరిస్థితుల్లో తెలుగుదేశంతో ఇకపై పొత్తు పెట్టుకునే ప్రశక్తే లేదని తేల్చి చెబుతున్నా, రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి మాత్రం బీజేపీ పార్టీ రాష్ట్రంలో తెలుగుదేశం, జనసేనతో పొత్తు పెట్టుకోబోతునట్టు లీకులు వదులుతూ వచ్చారు.
కొద్ది రోజుల క్రితం బీజేపీ సంస్థాగత వ్యవహారాల కార్యదర్శి శివప్రకాశ్ తో రాష్ట్ర నాయకత్వం జరిపిన సమావేశంలో పురందేశ్వరి వర్గానికి చెందిన కొందరు నేతలు తెలుగుదేశంతో పొత్తు అనివార్యం అన్న రీతిలో నొక్కి చెప్పారు. ఒంటరిగా ఎన్నికల్లో పోటీ చేస్తే ఒక్క సీటు కూడా గెలిచే అవకాశం లేదని, కనీసం డిపాజిట్లు కూడా దక్కే పరిస్థితి లేదని తెలుగుదేశంతో పొత్తు కోరుకుంటున్న పురందేశ్వరి వర్గం చెప్పినట్టు తెలిసింది. అయితే కొందరు నేతలు మాత్రం పొత్తుకు విముఖత వ్యక్తం చేశారు. అయితే తాజాగా సెంట్రల్ బీజేపీ పెద్దలు ఈ వ్యవహారంపై నివేదిక తెప్పించుకుని రాష్ట్ర బీజేపీ నేతల తీరుపై అనహనం వ్యక్తం చేసినట్టు సమాచారం. రాష్ట్ర నాయకత్వంలో చాలామందికి పొత్తులపైనే ధ్యాస తప్ప రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయడంపై ఎవరూ దృష్టిపెట్టడం లేదని వారు అగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది.
ఈ నేపద్యంలో పొత్తుల విషయం పక్కన పెట్టి ముందు రాష్ట్రంలో బీజేపీ పార్టీకి 175 అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు 25 పార్లమెంట్ నియోజకవర్గాల్లో అభ్యర్థులు సిద్ధంగా ఉండాల్సిందేనని తేల్చి చెప్పినట్టు తెలుస్తుంది. ప్రతి పార్లమెంట్ సెగ్మెంటుకు ముగ్గురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసి పంపించాలని సూచించినట్టు తెలుస్తుంది. తద్వారా మొత్తం 200 మంది అభ్యర్ధులను సిద్ధం చేసే ప్రక్రియకు కసరత్తు కేంద్ర బీజేపీ పార్టీ పూనుకునట్టు స్పష్టమవుతుంది.
టీడీపీ, జనసేనతో పొత్తు పెట్టుకుని పరోక్షంగా చంద్రబాబుకి లాభం చేకూర్చడంతో పాటు తానూ కూడా వారి మద్దతుతో ఎంపీ అభ్యర్థిగా సులభంగా గెలవచ్చని, ఆ పై కేంద్రంలో మంత్రి పదవి కొట్టేయొచ్చని ఆశలు పెట్టుకున్న దగ్గుబాటి పురందేశ్వరికి బీజేపీ అగ్రనేతలు ఇచ్చిన ఆదేశాలతో షాక్ కొట్టినట్లయ్యింది. ఇక బీజేపీ పెద్దల ఆలోచనను పురందేశ్వరి పాటిస్తారా లేక చంద్రబాబు ఆలోచనల మేరకు మరో పధకరచనకు పూనుకుంటారో వేచి చూడాలి.