అధికార వైయస్సార్సిపి పార్టీపై ఏదొక రకంగా బురదజల్లాలనే ఉద్దేశ్యంతో అసత్య ఆరోపణలు చేసేందుకు విపక్ష పార్టీలు వెనుకాడటం లేదన్న విషయం తెలిసిందే. తాజాగా రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలైన పురంధేశ్వరి టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డిని అన్యమతస్థుడుగా ఆరోపించడం గమనార్హం. కాగా నిజానికి భూమన కరుణాకర్ రెడ్డి అన్య మతస్తుడనేందుకు ఎలాంటి ఆధారాలు లేకున్నా ఈ ఆరోపణలు చేయడం ఖండించాల్సిన విషయంగా చెప్పొచ్చు.
వాస్తవానికి భూమన కరుణాకర్ రెడ్డి కుమార్తె నీహారెడ్డికి, దివంగత మహానేత వైయస్ రాజశేఖర్ రెడ్డి సోదరులైన వైయస్ రవీంద్రారెడ్డి కుమారులు వైయస్ సుమధర్ రెడ్డికి 2011లో వివాహం జరిగింది. కానీ వైయస్ రవీంద్రారెడ్డి కుటుంబం క్రిస్టియన్ మత విశ్వాసాలకు అనుగుణంగా నడచుకుంటున్నందున ఆ వివాహం క్రిస్టియన్ సాంప్రదాయం ప్రకారం జరిగింది. ఈ వివాహం జరిగిన 4 సంవత్సరాలకు అంటే 2015లో కరుణాకర్ రెడ్డి కుమారుడైన భూమన అభినయ్ రెడ్డి హిందూ సాంప్రదాయం ప్రకారం వివాహం జరిగడం గమనించాల్సిన విషయం. కానీ కేవలం భూమన కరుణాకర్ రెడ్డి కుమార్తె వివాహాన్ని మాత్రమే ప్రామాణికంగా తీసుకుని ఆయనకు అన్యమతస్థుడనే ట్యాగ్ తగిలించడం సబబు కాదు.
భూమన చేపట్టిన సంస్కరణలు :
2006 నుంచి 2008 వరకు భూమన కరుణాకర్ రెడ్డి చేసిన సంస్కరణలు, నిర్వహించిన కార్యక్రమాలు టీటీడీ చరిత్రలో చిరస్థాయిగా నిలిచితాయనడంలో ఎలాంటి సందేహం లేదు. టీటీడీ ద్వారా కళ్యాణమస్తు కార్యక్రమం ఏర్పాటు చేసి 30 వేల మందికి పైగా సామూహిక వివాహాలు జరిపించిన ఘనత కరుణాకర్ రెడ్డికి దక్కింది. అంతేకాకుండా దళిత గోవిందం కార్యక్రమం ద్వారా దళిత వాడలలో శ్రీ వేంకటేశ్వర స్వామి వారి కళ్యాణాలు జరిపి భూమన సంచలనం సృష్టించారు. మెట్ల మార్గంలో నడచి వచ్చే భక్తులకు టోకెన్లు మంజూరు చేసి వారికి ఉచిత శ్రీవారి దర్శన భాగ్యం కల్పించారు. పదకవితా పితామహులు అన్నమయ్య 600 వర్ధంతి ఉత్సవాలు కరుణాకర్ రెడ్డి హయాంలో ఘనంగా నిర్వహించబడ్డాయి.అదేవిధంగా తిరుమల ఆలయ నాలుగు మాడ వీధుల్లో చెప్పులు విడిచి తిరగాలనే నియమం పెట్టారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రతిరోజు , ఇరవై నాలుగు గంటలు కోట్లాది మంది భక్తులు వీక్షించే శ్రీ వేంకటేశ్వర భక్తి చానల్ని 2008లో అప్పటి దేశ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్చే ప్రారంభించారు. ఇలా అనేక సంస్కరణలు చేపట్టిన టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డిని అన్య మతస్తుడిగా ముద్ర వేసి ప్రచారం చేయడం తీవ్రంగా ఖండించాల్సిన విషయం. వాస్తవాలను దాచిపెట్టి అసత్య ప్రచారాలు చేసేవారిపట్ల అప్రమత్తంగా ఉండి తిప్పికొట్టాల్సిన బాధ్యత ప్రజలపై ఉంది.