ఆంధ్రప్రదేశ్ లో తుది విడత ఎన్నికల ప్రచారానికి ప్రధాని మోడీ నేడు రానున్నారు. ఇటీవల రాజమండ్రి, అనకాపల్లి సభల్లో పాల్గొన్న ప్రధాని.. నేడు ఓ బహిరంగ సభ, మరో రోడ్ షోలో పాల్గొనబోతున్నారు. అయితే ఇప్పటివరకూ మోడీ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నా సీఎం జగన్ పై నేరుగా విమర్శలు చేయకపోవడంపై టీడీపీ-బీజేపీ నేతలు అసంతృప్తిగా ఉన్నారు.
ఇప్పటివరకూ రాష్ట్రంలో చిలకలూరిపేట, రాజమండ్రి, అనకాపల్లి సభల్లో పాల్గొన్న ప్రధాని మోడీ.. ఇవాళ రాయలసీమలోని చిత్తూరు జిల్లా పీలేరు నియోజకవర్గం కలికిరిలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. పీలేరు సభ అనంతరం ప్రధాని మోడీ తిరుపతి ఎయిర్ పోర్టుకు చేరుకుని అక్కడి నుంచి గన్నవరం ఎయిర్ పోర్టుకు వస్తారు. అక్కడి నుంచి విజయవాడ చేరుకుని బందరు రోడ్డులో ఏర్పాటు చేసే రోడ్ షోలో పాల్గొంటారు. నగరంలోని ఇందిరాగాంధీ స్టేడియం నుంచి బెంజిసర్కిల్ వరకూ దాదాపు కిలోమీటరుపైగా దూరంలో ఈ రోడ్ షో ఉంటుంది. ఇది పూర్తి చేసుకుని ప్రధాని మోడీ తిరిగి గన్నవరం నుంచి ఢిల్లీకి వెళ్ళిపోతారు .
కాగా ఇప్పటి వరకు జరిగిన సభలలో సీఎం జగన్ పై నేరుగా ఒక్క మాటా మాట్లాడలేదు. దీంతో ఇవాళ జగన్ కు గత ఎన్నికల్లో పూర్తిగా అండగా నిలిచిన సొంతగడ్డ రాయలసీమలో అయినా మోడీ మాట్లాడతారా లేక పైపై విమర్శలకు పరిమితమవుతారా అన్న సందేహాలు కూటమి నేతల్లో బలంగా ఉంది.