రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్ పెన్షన్ కానుక పంపిణీ శరవేగంగా జరుగుతోంది. గురు, శుక్రవారాలు కలిపి 61,09,122 మందికి రూ.1,810 కోట్ల నగదును వలంటీర్లు, సచివాలయ సిబ్బంది అందజేశారని ఉన్నతాధికారులు వెల్లడించారు. దీంతో 92.35 శాతం నమోదైంది. శనివారం కూడా ఈ ప్రక్రియ కొనసాగింది. అనారోగ్యంతో మంచానికే పరిమితమైన వృద్ధులు గతంలో పింఛన్ సొమ్ము కోసం అష్టకష్టాలు పడుతూ వెళ్లేవారు. పనులు మానుకుని వారితో ఒకరు లేదా ఇద్దరు వెళ్లిన పరిస్థితులున్నాయి. నేడు వలంటీర్లు ఇంటికొచ్చి ఇస్తుండటంతో ఆ ముసలివాళ్ల కళ్లలో నుంచి ఆనందభాష్పాలు వస్తున్నాయి. లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి జగన్ ఇచ్చిన పెన్షన్ సొమ్మును అందిస్తూ ఆశీర్వాదాలు అందుకుంటూ మురిసిపోతున్నారు వలంటీర్లు. ప్రజలకు సేవ చేసే అవకాశాన్ని కల్పించిన సీఎంకు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.