గత కొంతకాలంగా స్తబ్దుగా ఉన్న పవన్ మళ్ళీ పర్యటనల పేరిట యాక్టివ్ అవుతున్నారు. హైదరాబాద్ లో షూటింగుల్లో గ్యాప్ దొరికిందో ఏమో కానీ… ఇపుడు సడెన్గా గోదావరి జిల్లాల్లో పర్యటన అంటూ ముందుకొస్తున్నారు. ఈ నెల 14 నుంచి 17 వరకూ జరిగే ఈ పర్యటనలో ఉభయగోదావరి జిల్లాలలో సమావేశాలను నిర్వహించనున్నారు.
2019 నుండి 2022 డిసెంబర్ వరకూ కేవలం 60 సార్లు మాత్రమే రాష్ట్రానికి వచ్చిపోయిన పవన్ 22 డిసెంబర్ లో వారాహి వాహనం గిఫ్ట్ గా తీసుకోని ఇహ పై రాష్ట్రం మొత్తం పర్యటిస్తానన్నారు కానీ చంద్రబాబు అరెస్టు సమయంలో చేసిన 4 విడతల వారాహి యాత్రల తర్వాత, టీడీపీతో పొత్తు ప్రకటించాక హఠాత్తుగా వారాహీ పర్యటనలు ఆపేసి, ఆపై తెలంగాణ ఎన్నికల్లో ఆంధ్రా ప్రభుత్వం గురించి మాట్లాడుతూ పబ్బం గడుపుకుని, ఆపై చంద్రబాబుతో పొత్తులూ, సీట్ల సర్దుబాటు అంటూ ఇప్పటి వరకూ కాలక్షేపం చేసిన పవన్కళ్యాణ్ ఇకపై మరి గోదావరి జిల్లాల పర్యటనలో ఏం చేయనున్నారో చూడాలి.
పేరుకి టీడీపీ జనసేన మధ్య సమన్వయాలు, ఇరు పార్టీల శ్రేణుల మధ్య సహృధ్భావ వాతావరణం అంటున్నారు కానీ, నిజానికి పొత్తు నచ్చక దూరమవుతున్న కాపు జనసేన నేతలను బుజ్జగించి, పొత్తుకి సపోర్ట్ చేసేలా ప్రేరేపించడానికే ఈ సమావేశాలు అని రాజకీయ వర్గాలు అనుకుంటున్నాయి. పార్టీ పెట్టి పదేళ్ళయినా ఇప్పటివరకూ స్థానిక కార్యకర్తలను పెద్దగా కలవకపోగా ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇప్పుడు సడెన్గా జనసైనికులు, వీరమహిళలతో సమావేశాలు నెరపి పార్టీని ఏవిధంగా బలోపేతం చేద్దామనో మరి పవన్కళ్యాణే చెప్పాలి. ఇప్పటి వరకూ అసలు జనసేనకి చంద్రబాబు ఎక్కడ ఎమ్మెల్యే సీట్లు విదిల్చాడో కూడా తెలియకుండా మరి స్థానిక జనసేన నేతలకు ఏం చెప్పి ఉత్సాహపరుస్తారో అన్నది ఆసక్తికరం