జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన రాజకీయ ప్రయాణంలో మరో తప్పటడుగు వేశారు. సంఖ్యాపరంగా బలమైన సామాజికవర్గం, హీరో చరిష్మా తోడు ఉన్నా ఆయన వ్యవహార శైలి వలన అవేమీ ఆయనకి అక్కరకి వస్తునట్టు కనిపించడంలేదు. రాజకీయాల్లోకి వచ్చి సుమారు 15ఏళ్ళు కావస్తున్నా ఇప్పటికి రాజకీయ నిర్ణయాలు తీసుకోవడంలో పరిణితి లేకపోవడం. క్యాడర్ ఆలోచనలకి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకోవడం, ఎవరి సలహాలు పాటించకుండా డిక్టేట్ చేస్తూ ఏక పక్ష నిర్ణయాలు తీసుకోవడం, ఇవన్ని ఆయన చేత పదే పదే తప్పటడుగులు వేయించడంలో ప్రధమ కారణాలుగా మారుతున్నాయి.
తాజాగా తెలంగాణ ఎన్నికలు కూడా దీనికి సాక్ష్యంగా మారాయి. అసలు ఆయన ఎందుకు తెలంగాణలో పోటీ చేశారనే ప్రశ్నకి జనసేన నాయకుల దగ్గరే సరైన విశ్లేషణాత్మక సమాధానం లేదు. కేవలం బీజేపీ పార్టీ చెప్పిందనో లేక మరో పార్టీకి మేలు చేయాలనో రాజకీయ నిర్ణయాలు తీసుకోవడం వలన తన పార్టీ ప్రజల్లో మరింత పలుచనౌతుందనే ఆలోచన పవన్ కళ్యాన్ లో లోపించడం ఆయన రాజకీయ పరిణితి స్థాయిని తెలియచేస్తుంది. ఏపీలో మూడు , నాలుగు నెలల్లో ఎన్నికలు పెట్టుకుని ఆయన తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేసి సాధించింది ఎంటి అనేది జనసేన నేతలే ఆఫ్ ద రికార్డ్ మాట్లాడుకుంటున్నారు.
2019 ఎన్నికల్లో కూడా ఆయన పోటీ చేసిన రెండు స్థానాల్లో ఓడిపోయినప్పటికి ఇప్పుడు ఎదురవుతున్న హేళన నాడు ఆయన ఎదుర్కోలేదు. కారణం నాడు ఆయన కానీ ఆయన పార్టీ క్యాడర్ వ్యవహారశైలి కానీ నేడు ఉన్నంత జుగుప్సాకరంగా లేదు. 2019 లో ఓటమి చెందినప్పటినుండి ముఖ్యమంత్రి జగన్ గారిపై విపరీతమైన వ్యక్తిగత ద్వేషం పెంచుకోవడం, అదే ద్వేషాన్ని వారి అభిమానులకి సైతం నూరిపోయడం, ఎవరు ముఖ్యమంత్రి విధానాలని , పాలనని ప్రశంసించినా వారిపై సోషల్ మీడియా వేదికగా వ్యక్తిగత దూషణలు చేయడం, లాంటి కార్యక్రమాలతో సమాజంలో ఒక నియంత సైన్యంలా మారుతూ వచ్చారు.
సాధారణంగా ప్రజాస్వామ్య పద్దతులకి అలవాటుపడిన ఇక్కడి ప్రజలు ఒక నియంత సైన్యంలా మారుతున్న పవన్ కళ్యాణ్ అభిమానులని భరించలేని, స్థాయికి వెళ్ళిపోయారు. సాటి హీరో అభిమానులను దూషించడం, ప్రభుత్వ పరిపాలనను సమర్ధించినవారిపై మాటల దాడి చేయడం, మరీ శృతిమించి భౌతిక దాడులకి సైతం వెనకాడం అంటూ హెచ్చరికలు చేయడం లాంటి కారణాలతో విసుగు చెందిన ప్రజలు అవకాశం ఉన్నప్పుడల్లా వారు కూడా పవన్ కళ్యాణ్ విధానాలని వేలెత్తి చూపుతూనే ఉన్నారు. 2019 నుండి ఆయన చేస్తున్న పనులకి అది మరింతగా పెరిగిందనే చెప్పవచ్చు. ఈ కారణం చేతనే తెలంగాణ ఎన్నికల్లో డిపాజిట్లు సైతం సాధించలేక చతికిలపడిన పవన్ కళ్యాణ్ సామర్ధ్యంపై నెట్టింట్లో విపరీతమైన జోకులు పేలుతున్నాయి.
ఏపీ ఎన్నికల్లో పతనావస్తలో ఉన్న చంద్రబాబు పార్టీతో జతకట్టి తనకి నచ్చినన్ని సీట్లు తీసుకుని టీడీపీ సహాయంతో ఎమ్మల్యే అవ్వవచ్చని ఆశపడుతున్న పవన్ కళ్యాణ్ కి తెలంగాణా ఎన్నికలు గట్టి షాక్ నే ఇచ్చాయి. పోటీ చేసినన 8 స్థానాల్లో 7 స్థానాల్లో బిజేపీతో పోత్తులో ఉన్నా కనీసం డిపాజిట్లు కూడా రాకపోవడం లాంటి అంశాలు రేపటి నాడు ఏపీ ఎన్నికల్లో కూడా ఆయన పార్టీపై తీవ్ర ప్రభావం చూపనున్నాయి. సీట్లు పంచుకునే సమయంలో జనసేనకి చెక్ పెట్టడానికి అవకాశం కోసం ఎదురు చూస్తున్న చంద్రబాబుకి ఈ అంశం ఒక ఆయుధంగా మారుతుంది. పవన్ తన బార్గెయింగ్ పవర్ కోల్పోయాడనే చెప్పాలి.
అభిమానుల అత్యుత్సాహం , ముఖ్యమంత్రి జగన్ పై వ్యక్తిగత ద్వేషం, నియంత మనస్తత్వం, చంద్రబాబుని నమ్ముకోవడం , పార్ట్ టైం రాజకీయాలు , వేస్తున్న తప్పటడుగులు వెరసి చివరికి పవన్ కళ్యాణ్ అటు తెలంగాణకి కాకుండా ఇటు ఏపీకి కాకుండా ఎవరి నమ్మకాన్ని పొందలేని ఒక విఫల నాయకుడిగా మారాడనేది వాస్తవం..
ఇటీవల ఆయనే నేను ఒక విఫల రాజకీయ నేతను అని అభిమానుల దగ్గర యధాలాపంగా అన్నా జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అది నిజమే అనే మాట ఇప్పుడిప్పుడే ఆయన పార్టీ నుండి బయటికి వచ్చినవారు చెబుతున్న మాటలను బట్టి ఆయనపై నమ్మకం పెట్టుకున్న వారికి తెలుస్తుంది.. ఇప్పటికైన ఆయనలో ఆయన అభిమానుల్లో మార్పు వస్తుందో లేక ఇలాగే వారి వ్యవరశైలి ఉంటుందో కాలమే నిర్ణయిస్తుంది.