2024 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మొదటి భాగమైన నామినేషన్లపర్వం ఈనెల 25వ తేదీకి ముగిసింది. అభ్యర్థులు నామినేషన్లు పూర్తి అయిన తర్వాత దాఖలు చేసిన పత్రాల పరిశీలన ఉంటుంది. అలా ఎన్నికల పర్వంలో రెండో ఘట్టమైన నామినేషన్ల పరిశీలన పూర్తి అయింది. గత రెండు రోజులుగా జరుగుతున్న నామినేషన్ల పత్రాలు పరిశీలన పూర్తి అయినట్లు రాష్ట్ర ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా మీడియాతో తెలిపారు.
రాష్ట్రంలో 25 లోక్సభ స్థానాలకు 686 నామినేషన్లు దాఖలు కాగా 503 నామినేషన్లుకు ఆమోదముద్ర లభించిందని ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. 175 అసెంబ్లీ స్థానాలకు 3644 నామినేషన్లు దాఖలు కాగా 2,705 నామినేషన్లను ఆమోదించడం జరిగిందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి తెలిపారు. పార్లమెంట్ పరిధిలో నామినేషన్లు దాఖలు చేసిన 183 మంది నామినేషన్లను తిరస్కరించడం జరిగిందని తెలిపారు. అసెంబ్లీ నియోజకవర్గం సంబంధించి 939 నామినేషన్లను పరిశీలన అనంతరం తిరస్కరించడం జరిగిందన్నారు. ఈ నెల 18 నుం చి 25వ తేదీ వరకు జరిగిన నామినేషన్ల స్వీకరణ కార్యక్రమంలో 25 పార్లమెంట్ స్థానాలకు సంబంధించి మొత్తము 686 నామినేషన్లు, 175 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి మొత్తం 3,644 నామినేషన్లు దాఖలు అయినట్టు ఆయన తెలిపారు. కాగా ఈ నెల 29 వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉంది. నామినేషన్ల ఉపసంహరణ తర్వాత అభ్యర్థులు ఎంతమంది పోటీలో ఉండేది తెలుస్తుంది . దానికి అనుగుణంగా ఈవీఎంలు రెడీ చేస్తామని తెలిపారు.