సంగీత్ శోభన్, రామ్ నితిన్, గౌరి ప్రియా, అనంతిక, గోపిక లాంటి కొత్త నటీనటులు, సాంకేతిక నిపుణులతో సితార ఎంటర్టైన్మెంట్స్ రూపొందించిన ‘మ్యాడ్’ చిత్రం గత సంవత్సరం అక్టోబర్ 6న థియేటర్స్ లో విడుదలై ఘనవిజయం సాధించింది. ఇప్పుడీ చిత్రానికి సీక్వెల్ రాబోతుంది. మ్యాడ్ సినిమా సీక్వెల్ గా మ్యాడ్ స్క్వేర్ రూపొందిస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ‘మ్యాడ్’లో నటించి మెప్పించిన యువ కథానాయకులు నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ లు ఈ సినిమాలో తిరిగి నటించనున్నారు కానీ హీరోయిన్లు మాత్రం మారనున్నారు. కొత్త హీరోయిన్ల వివరాలు త్వరలో వెల్లడించనున్నారు.
ఇటీవలే సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ డీజే టిల్లుకు సీక్వెల్ గా టిల్లు స్క్వేర్ రూపొందించి 100 కోట్ల కలెక్షన్స్ కొల్లగొట్టింది. ఇప్పుడు అదే నిర్మాణ సంస్థ నుంచి మ్యాడ్ సినిమా సీక్వెల్ గా మ్యాడ్ స్క్వేర్ అనౌన్స్ చేయడంతో ఈ సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి. దాంతో పాటు ‘మ్యాడ్’తో రచయిత-దర్శకుడిగా పరిచయమైన కళ్యాణ్ శంకర్, సితార సంస్థ నిర్మించిన ‘ టిల్లు స్క్వేర్’చిత్రానికి రచయితలలో ఒకరిగా పనిచేశారు. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర హారిక, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. మరి టిల్లు స్క్వేర్ తరహాలో మ్యాడ్ స్క్వేర్ ఏ స్థాయిలో అలరిస్తుందో కొంతకాలం ఆగితే తెలిసిపోతుంది.