కొలికపూడి శ్రీనివాసరావు.. ఎల్లో మీడియా ఫాలో అయ్యేవారికి పెద్దగా పరిచయం అక్కరలేని పేరు. ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ సమితి అధ్యక్షునిగా చెప్పుకునే కొలికపూడి శ్రీనివాసరావు ఎల్లప్పుడూ ఎల్లో మీడియా డిబేట్స్ లో ప్రభుత్వంపై విషప్రచారం చేయడమే లక్ష్యంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ఉంటారన్న విషయం తెలిసిందే. చంద్రబాబు భజనతో పాటు శృతిమించిన వ్యాఖ్యలు చేయడం ఆయన నైజం. తాజాగా మరోసారి దర్శకుడు ఆర్జీవీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి చేసి వార్తల్లో నిలిచారు.
డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ సమాజానికి పట్టిన చీడ అని అతని తల నరికి తెచ్చిన వారికి కోటి రూపాయలు ఇస్తానని ఓ టీవీ ఛానెల్ డిబేట్ లో బెదిరింపుకు కొలికపూడి శ్రీనివాసరావు దిగాడు. ఆర్జీవీ రూపొందించిన వ్యూహం సినిమాలో తన అభిమాన నాయకుల పరువుకు భంగం కలిగించేలా సన్నివేశాలు చిత్రీకరించారని అసహనాన్ని వెళ్లగక్కిన కొలికపూడి ఏకంగా ఆర్జీవీపై బహిరంగంగా బెదిరింపులకు దిగడం గమనార్హం. నిజానికి గతంలో ఓ టీవీ డిబేట్ లో శృతిమించిన ప్రవర్తనతో వార్తల్లో నిలిచిన కొలికపూడిని సదరు టీవీ చానెళ్లు ఎందుకు డిబేట్ లకు ఆహ్వానించడంతో ఉన్న లోగుట్టు ప్రజలందరికీ తెలుసు.
గతంలో ఓ ప్రముఖ టీవీ ఛానెల్ డిబేట్ జరుగుతున్న క్రమంలో పెయిడ్ ఆర్టిస్ట్ అన్న నేరానికి లైవ్ లో అందరూ చూస్తుండగానే బీజేపీ లీడర్ విష్ణువర్ధన్ రాజుపై చెప్పుతో దాడికి దిగిన కొలికపూడి శ్రీనివాసరావు అప్పట్లో హాట్ టాపిక్ గా నిలిచారు. ఈ రభస జరగ్గానే ఆ డిబేట్ కి హోస్ట్ గా వ్యవహరించిన వెంకటకృష్ణ, తన డిబేట్స్ లో కొలికపూడి శ్రీనివాసరావును శాశ్వతంగా బహిష్కరిస్తున్నాని ప్రకటించాడు కానీ ఆ విషయం గురించి ప్రజలు మర్చిపోయారనుకున్నాడేమో మళ్ళీ తన డిబేట్స్ కి తిరిగి ఆహ్వానించి ప్రభుత్వంపై విషప్రచారం చేయిస్తున్నాడు.
ప్రభుత్వంపై బురదజల్లించేందుకు ఎంతకైనా దిగజారే ఎల్లో మీడియా తన మాటలపై, చేతులపై అదుపులేని కొలికపూడి లాంటి వ్యక్తిని డిబేట్స్ లో కూర్చోబెట్టి వివాదాస్పద వ్యాఖ్యలు చేయిస్తూ తద్వారా లబ్ది పొందేందుకు ప్రయత్నిస్తున్నాయి. కానీ ప్రభుత్వంపై ఎల్లో మీడియా చేసే విష ప్రచారాన్ని నమ్మేందుకు ప్రజలు సిద్ధంగా లేరన్న సంగతి సదరు మీడియా సంస్థలు గుర్తెరిగి నడుచుకోవడం మంచిది. ఏదేమైనా ఇలా అక్కసుతో తలలు నరకమని బహిరంగంగా బెదిరింపులకు పాల్పడుతున్న కొలికపూడిపై తగిన చర్యలు తీసుకోవాలని పలువురు అభిప్రాయపడుతున్నారు.