ఓడరేవుల ద్వారా రాష్ట్ర ఖజానాకు అధికారిక లెక్కల ప్రకారం ఏటా రెండు నుంచి మూడు వందల కోట్ల వరకు ఆదాయం లభిస్తోంది. ఇందులో నిర్వహణ వ్యయంపోను అతితక్కువగా మిగులు ఉంటోంది. అయితే కాకినాడలోని రెండు పోర్టులు అత్యధిక కార్గో రవాణా జరుగుతున్నట్టు తాజా గణాంకాలు తెలియజేస్తున్నాయి.
కాకినాడలోని రెండు పోర్టులు (ఏంకరేజ్, డీప్ వాటర్ పోర్టులు), రవ, గంగవరం, కృష్ణపట్నం ఓడరేవులు రాష్ట్రంలో ఉన్నాయి. వీటి ద్వారా అత్యధికంగా వంద మిలియన్ టన్నుల వరకు కార్గో రవాణా జరుగుతోంది. అయితే తాజాగా గణాంకాల మేరకు ఆదాయం మాత్రం తక్కువగా లభిస్తున్నట్లు తేలింది. లెక్కలు తేలిన ఐదు ఓడరేవుల్లో కాకినాడలోని రెండు ఓడరేవుల ద్వారానే ఎక్కువ ఆదాయం లభించగా, రెండో స్థానంలో కృష్ణపట్నం ఉన్నట్లు తేలింది.
కాకినాడలోని రెండు ఓడరేవుల ద్వారా గత 13 సంవత్సరాల్లో 195 మిలియన్ టన్నుల సరుకు రవాణా జరిగింది. దీని ద్వారా 1530 కోట్ల రూపాయల ఆదాయం సమకూరింది. అలాగే రెండవ స్థానంలో నిలిచిన కృష్ణపట్నం ఓడరేవులో 494 మిలియన్ టన్నుల సరుకు రవాణా జరిగి.. ఈ పోర్టు రవాణా ద్వారా 504 కోట్ల వరకు ఆదాయాన్ని సమకూర్చింది.( సరుకు రవాణాలో కృష్ణపట్నం ఓడరేవు ముందు వరుసలో ఉన్నప్పటికీ, ఆదాయంలో మాత్రం కాకినాడలోని రెండు ఓడరేవులే తొలి స్థానంలో కనిపిస్తున్నాయి. )
ఇక కాకినాడలో గంగవరం ఓడరేవు ద్వారా 256 కోట్ల వరకు ఆదాయం సమకూరగా, ‘రవ’ పోర్టు ద్వారా కేవలం 49 కోట్లు మాత్రమే వచ్చింది. ఈ పోర్టు ద్వారా అతి తక్కువగా 7.86 మిలియన్ టన్నుల సరుకు మాత్రమే రవాణా జరిగినట్లు లెక్కలు తేల్చారు.