రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ పాలిటెక్నిక్ పూర్తి చేసిన విద్యార్థుల కోసం జాబ్‌మేళాలు నిర్వహిస్తోంది. ఆ శాఖ కమిషనర్ చదలవాడ నాగరాణి వెల్లడించిన మేరకు వివరాలిలా ఉన్నాయి. 2022, 2023 సంవత్సరాల్లో ఎలక్ట్రికల్, మెకానికల్ విభాగాల్లో ఉత్తీర్ణులైన వారికి విశాఖపట్నంలోని గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ ఇంజినీరింగ్‌లో మేళా ఏర్పాటు చేశారు.
ఈ మేళాలో 74 మంది సుజ్లాన్ గ్లోబల్‌లో ఉద్యోగావకాశాలు పొందారు. ఎలక్ట్రికల్ నుంచి 28 మంది, మెకానికల్ నుంచి 46 మంది డిప్లొమా ఇంజినీర్ ట్రెయినీ స్థానాలకు రూ.2 లక్షల వార్షిక వేతనంతో ఎంపికయ్యారు. వారంతా ఎనిమిది రాష్ట్రాల్లో పాన్ ఇండియా స్థాయిలో ఆపరేషనల్ మెయింటెనెన్స్ సర్వీసెస్‌లో పని చేయాలి. సాంకేతిక విద్యాశాఖ ఫైనలియర్ విద్యార్థులకు మాత్రమే కాకుండా డిప్లొమా గ్రాడ్యుయేట్ చేసిన వారికి క్యాంపస్ రిక్రూట్మెంట్ డ్రైవ్ నిర్వహించేందుకు పలు కంపెనీలతో ఒప్పందాలు చేసుకుంటోంది. పాలిటెక్నిక్ విద్యార్థులకు ఉపాధి అవకాశాలను సృష్టించే వాతావరణాన్ని పెంపొందించి పరిశ్రమలతో చురుగ్గా అనుసంధానం అయ్యేందుకు కట్టుబడి ఉన్నామని నాగరాణి వెల్లడించారు.