జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు, మాజీ ఎంపీ హరిరామజోగయ్య విడిచి పెట్టడం లేదు. తన లేఖలకు సేనాని నుంచి స్పందన రాకపోయినా ఆయన రాయడం ఆపలేదు. తాజాగా సేన నుంచి కొందరికి ఎంపీ సీట్లను రికమెండ్ చేస్తూ లెటర్ రాశారు. పొత్తులో భాగంగా విజయనగరం నుంచి గేదెల శ్రీనివాస్ (తూర్పు కాపు), అనకాపల్లి నుంచి కొణిదెల నాగబాబు లేదా బొలిశెట్టి సత్యనారాయణ (కాపు), లేదా కొణతాల రామకృష్ణ (గవర), కాకినాడ నుంచి సానా సతీష్ (కాపు), నరసాపురం నుంచి మల్లినీడి తిరుమలరావు (కాపు), మచిలీపట్నం నుంచి బాలశౌరి (కాపు), తిరుపతి నుంచి వరప్రసాద్ (ఎస్సీ), రాజంపేట నుంచి ఎస్.బాలసుబ్రహ్మణ్యం లేదా ఎంవీ రావు (బలిజ)ను పోటీ చేయించేలా సీట్లు అడగాలని సూచించారు.
ఇదెక్కడి గోల దేవుడా..
పవన్ సీట్లు ఇచ్చే పరిస్థితి లేదు. ఈ విషయం అందరికీ తెలుసు. భారతీయ జనతా పార్టీతో పొత్తు ఖరారయ్యాక ఒకటో, రెండో ఇస్తే మహా ప్రసాదమంటూ కళ్లకు అద్దుకుని జనసేన తీసుకోవాలి. ఇలాంటి నేపథ్యంలో నువ్వు సీఎం కావాలి. 50కి పైగా అసెంబ్లీ సీట్లు అడుగు. ఏడెనిమిది ఎంపీ స్థానాలు తీసుకో అంటూ జోగయ్య రాస్తున్న లేఖలు సేనానికి చిరాకు తెప్పిస్తున్నాయంట. ఆయన్ను ఆపే మార్గం లేదా అని సన్నిహితులను అడిగినట్లు తెలిసింది.
ఎంపీ సీట్లను టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బేరం పెట్టినట్లు ప్రచారం ఉంది. ధన బలం ఉన్నవారికే ఇవ్వాలని చూస్తున్నారు. నరసాపురం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేయాలని రఘురామకృష్ణంరాజు ఆశ పడుతున్నారు. నిత్యం ఎల్లో మీడియాలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని తిట్టడంతో ఆ సీట్ తనకే ఇస్తారని ఆయన చెప్పుకొంటున్నారు. అనకాపల్లి ఎంపీగా తన కొడుకు చింతకాయల విజయ్ను బరిలోకి దింపాలని టీడీపీ సీనియర్ నాయకుడు అయ్యన్న పాత్రుడు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. తమ కుటుంబం మొదటి నుంచి పార్టీలో ఉందని, అధిక ప్రాధాన్యం మా అబ్బాయికే ఇవ్వాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు బుద్ధా వెంకన్న తనకు విజయవాడ పశ్చిమం ఇవ్వలేని పక్షంలో అనకాపల్లి ఎంపీ సీటు ఇవ్వాలని చంద్రబాబును డిమాండ్ చేస్తున్నారు. తిరుపతి ఎంపీ స్థానాన్ని వరప్రసాద్‌కు ఇప్పించాలని జోగయ్య కోరారు. ఈయన గతంలో ఇదే సీటులో వైఎస్సార్సీపీ నుంచి పోటీ చేసి గెలిచారు. తర్వాత గూడూరు ఎమ్మెల్యే అయ్యారు. 24 టికెట్ లేదని తెలియడంతో పక్క చూపులు చూస్తున్నారు. కానీ బీజేపీతో పొత్తు ఓకే అయితే ఈ స్థానం కావాలని ఆ పార్టీ తప్పనిసరిగా అడుగుతుంది. రాజంపేట, కాకినాడ, మచిలీపట్నం తదితర స్థానాలను తెలుగు తమ్ముళ్లే ఆశిస్తున్నారు. కమలం లైన్లోకి వస్తే ఎక్కువ ఎంపీ స్థానాలు ఇవ్వాలి. దీంతో జోగయ్య తన కోటాలో చెప్పినట్లు ఏ ఒక్క స్థానం కూడా చంద్రబాబు జనసేనకు ఇచ్చే అవకాశం లేదు.
ఇప్పటికే పవన్ చేష్టలతో జనసైనికులు విసిగిపోయారు. ఆయన బాబుకు పూర్తిగా లొంగిపోయాడని భావిస్తున్నారు. పైకి తమ నాయకుడిపై అభిమానం చూపుతున్నా.. లోపల మాత్రం రగిలిపోతున్నారు. జోగయ్య లేఖలను పరిగణలోకి తీసుకుని టికెట్లు అడగకుండా.. మీరు తగ్గి ఉండండి. భావోద్వేగాలకు పోయి సీట్ల గురించి మాట్లాడొద్దంటూ సేనాని హితబోధ చేయడం వారికి నచ్చడం లేదు. కార్యకర్తలు తనపై అసంతృప్తి వ్యక్తం చేసేలా జోగయ్య లేఖలున్నాయని పవన్ భావిస్తున్నారు. వాటి విషయంలో చంద్రబాబు సీరియస్ అయితే తనకు ఇచ్చే ప్యాకేజీలో కోత పడుతుందని భయం కూడా ఉందంట. అసలు సీట్ల విషయంలో తనకే కోటా లేక ఏడుస్తుంటే.. నేను చెప్పినోళ్లకు టికెట్లు అడుగని జోగయ్య లేఖలు రాయడంపై బాధపడటం మినహా సేనాని ఏమీ చేయలేడు.