2024 ఎన్నికలలో టీడీపీ, జనసేన పొత్తు వ్యవహారంపై జనసేనాని పవన్ కళ్యాణ్ కు మాజీ ఎంపీ, కాపు సంక్షేమ సేన వ్యవస్థాపకుడు చేగొండి హరి రామ జోగయ్య సూటిగా పలు ప్రశ్నలు సంధిస్తూ లేఖ రాశారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో ఆయన పవన్ నుద్దేశించి సూటిగా పలు ప్రశ్నలు సంధిస్తూ ఒక లేఖను మీడియాకు విడు దల చేశారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని రాజ్యాధికారం నుంచి తప్పించడం అంటే టీడీపీకి పూర్తిగా రాజ్యాధికారం కట్టబెట్టడం కాదని పవన్ కళ్యాణ్ కు హరిరామ జోగయ్య చురకలు అంటించారు. పవన్ తనకు అధికారం ముఖ్యంకాదు.. రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని అంటుంటారని, అలాగైతే చంద్రబాబుకు అధికారం ధారపోస్తే పవన్ కలలుగంటున్న రాష్ట్ర ప్రయోజనాలు ఎలా దక్కుతాయని.. జనసైనికులు అడిగే ఈ ప్రశ్నలకు ఏం సమాధానం చెబుతారని జోగయ్య పవన్ కళ్యాణ్ ను ప్రశ్నించారు.
రెండు పార్టీలు పొత్తులో ఉన్నాయని చెప్పుకుంటున్నప్పుడు.. అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి పదవిని రెండు పార్టీలు పంచుకుంటాయని, రెండున్నరేళ్ళ జనసేనకు ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టనున్నట్లు.. చంద్రబాబు నోటితో పవన్ కళ్యాణ్ చెప్పించగలరా అంటూ ప్రశ్నించారు. చంద్రబాబుకు అధికారాన్ని కట్టబెట్టేందుకు కాపులు ఎందుకు కష్టపడాలంటూ రామ జోగయ్య పవన్ కళ్యాణ్ ను సూటిగా ప్రశ్నించారు.
జనసేన, తెలుగుదేశం పార్టీలకు అసెంబ్లీ సీట్ల పంపకం, ఉమ్మడి మేనిఫెస్టో విషయంలో దఫదఫాలుగా సమావేశాలు నిర్వహిస్తుండడం గమనిస్తున్నామని.. కానీ వారి మధ్యలో ఏయే చర్చలు జరిగాయో, ఎవరికెన్ని సీట్లుగా నిర్ణయించారో, ఏయే అభ్యర్థులను దృష్టిలో పెట్టుకుని అంగీకరించారో వివరిస్తూ ఓ ఎల్లో టీవీ ఛానల్లో జనసేనకు 30 సీట్లని, మరో ఎల్లో వార్తా పత్రికలో 27 సీట్లని ప్రకటనలు చేయడం ఆశ్చర్యంగా ఉందన్నారు. సీట్ల విషయంలో ఎల్లో మీడియా పూటకో ప్రకటన చేయడం ఎవరిని ఉద్దరించడానికంటూ జోగయ్య ప్రశ్నించారు.
2024 ఎన్నికలకు జనసేన సపోర్టు లేకుండా టీడీపీ ఒంటరిగా వెళ్తే మెజారిటీ సీట్లు దక్కించుకోవడం జరిగే పనికాదని… ఇందుకు 2019 ఎన్నికలే నిదర్శనం అన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుంటే జనసేనకు టీడీపీ ఎన్ని సీట్లు కేటాయిస్తుందనేది ప్రధాన అంశం కాదు.. జనసేన టీడీపీకి ఎన్ని సీట్లు ఇస్తుందనేది ముఖ్యమైన అంశం అంటూ జోగయ్య లేఖలో పేర్కొన్నారు.
కాపులు అధికంగా ఉన్న తూర్పు, పశ్చిమ గోదావరి,కృష్ణా, గుంటూరు జిల్లాల్లో జనసేన టీడీపీ నుంచి ఎన్ని సీట్లు దక్కించుకుంటోందనే దానికి పవన్ కళ్యాణ్ జనసైనికులకు సమాధానం చెప్పాలని జోగయ్య అన్నారు.
అయితే ఎన్నికల నోటిఫికేషన్ లోగా జనసేన టీడీపీ పార్టీలు ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు జోగయ్య.
చంద్రబాబును అధికారంలోకి తేవడానికి పవన్ కళ్యాణ్ కష్టపడుతుండటం.. జనసేనకు సరైన సీట్లు కూడా కేటాయించకుండా టీడీపీ వాడుకుంటున్న విధానం పట్ల హరి రామ జోగయ్య పవన్ కళ్యాణ్ ను ప్రశ్నించారు. కాపులకు కావాల్సినది టీడీపీ అధికారంలోకి రావడం కాదని స్పష్టం చేశారు.
అయితే 175 సీట్లు ఉన్న రాష్ట్రంలో కనీసం 50 సీట్లయినా జనసేన దక్కించుకోగలిగితేనే రాజ్యాధికారం పూర్తిగా కాకపోయినా పాక్షికంగానైనా దక్కే అవకాశం ఉంటుంది.. కానీ దానికి టీడీపీ ఒప్పుకునే దాఖలాలు కనిపించడం లేదు. టీడీపీ జనసేనను అధికారంలోకి వచ్చేంత వరకు వాడుకోని తరువాత పక్కకు పెట్టేస్తుందనేది కాపులు గుర్తించాల్సిన విషయం.