అర్హులైన కోటి కుటుంబాలకు ప్రతినెలా 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ను అందించడంలో భాగంగా ప్రధానమంత్రి సూర్య ఘర్ ముఫ్త్ బిజిలి యోజనకు కేంద్ర మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. సామాన్యులపై కరెంట్ ఛార్జీల భారాన్ని తగ్గించి సోలార్ విద్యుత్ వినియోగాన్ని పెంచడానికి ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకురావడం గమనార్హం. రూ.75,021 కోట్లను ఈ పథకం అమలుకు కేంద్ర ప్రభుత్వం కేటాయించింది.
ఈ పథకం కింద తమ గృహాలపై రూఫ్‌టాప్ సోలార్ వ్యవస్థను ఏర్పాటు చేసుకునే కుటుంబాలకు రూ.78 వేల వరకు కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ అందించనుంది. ఒక కిలో వాట్ వ్యవస్థకు రూ.30 వేలు, 2 కిలోవాట్ల వ్యవస్థకు రూ.60 వేలు, 3 కిలోవాట్ల వ్యవస్థకు రూ.78 వేల చొప్పున కేంద్రం నుంచి రాయితీ లభిస్తుంది. అంతేకాకుండా కేంద్రం ఇచ్చే రాయితీ కాకుండా మిగిలిన పెట్టుబడి కోసం ఎలాంటి పూచీకత్తు లేకుండానే బ్యాంకుల ద్వారా తక్కువ వడ్డీకే రుణం తీసుకొనే అవకాశాన్ని కేంద్రం కల్పించింది. 2025 నాటికి అన్ని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలపై రూఫ్‌టాప్ సోలార్ సిస్టమ్స్ ఏర్పాటు చేయాలని లక్ష్యంగా నిర్దేశించారు.
సౌర విద్యుత్‌పై గ్రామీణ ప్రజలకు అవగాహన కల్పించడానికి ప్రతి జిల్లాలో ఒక మోడల్ సోలార్ గ్రామాన్ని అభివృద్ధి చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని,ఈ సోలార్ ప్యానళ్ల ఏర్పాటుకు వెబ్సైట్లో గృహ వినియోగదారుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ వెల్లడించారు. కాగా ప్రధానమంత్రి సూర్య ఘర్ ముఫ్త్ బిజిలి యోజన పథకం ద్వారా సౌర విద్యుత్ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలనే గృహ విద్యుత్ వినియోగదారులు https:// pmsuryaghar.gov.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. తాము ఏర్పాటు చేసుకున్న సౌర విద్యుత్ వ్యవస్థ ద్వారా ఉత్పత్తి అయిన విద్యుత్ లో తాము వాడుకున్న యూనిట్లను మినహాయించి,మిగిలిన కరెంటును డిస్కమ్‌లకు విక్రయించి ఆదాయం పొందవచ్చు. ఆసక్తి వినియోగదారులు పైన ఇచ్చిన వెబ్సైట్ ద్వారా అప్లై చేసుకోగలరు.