ఐపీఎల్ 2024 లో భాగంగా ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా లక్నోతో జరిగిన మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ ఉత్కంఠభరిత విజయం సాధించింది, ప్లే ఆఫ్ అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌పై 19 పరుగుల తేడాతో గెలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది. అభిషేక్ పోరెల్ (58), స్టబ్స్ (57) టాప్ స్కోరర్లుగా ఉన్నారు. మిగతా బ్యాటర్లు కూడా సమష్టిగా రాణించారు. లక్నో బౌలర్లలో నవీన్ హుల్ హక్ 2 వికెట్లు, అర్షద్ ఖాన్, రవి బిష్ణోయ్ చెరో వికెట్ తీశారు.
అనంతరం భారీ లక్ష్య ఛేదనకు బరిలోకి దిగిన లక్నో సూపర్ జెయింట్స్ టాప్ ఆర్డర్ పూర్తిగా విఫలమైంది , క్వింటన్ డీకాక్ (12), కేఎల్ రాహుల్ (5), మార్కస్ స్టోయినిస్ (5), దీపక్ హుడా (0) త్వరత్వరగా ఔటయ్యారు. మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు నికోలస్ పూరన్, అర్షద్ ఖాన్ రాణించినప్పటికీ విజయతీరాలకు చేర్చలేకపోయారు. పూరన్ 27 బంతుల్లో 61 పరుగులు చేయగా.. అర్షద్ ఖాన్ 33 బంతుల్లో 58 పరుగులు రాబట్టి నాటౌట్‌గా నిలిచాడు..దీంతో లక్నో జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 189 పరుగులు మాత్రమే చేయగలిగింది.
ఢిల్లీ బౌలర్లలో ఇషాంత్ శర్మ అత్యధికంగా మూడు వికెట్లు తీశాడు. మిగతా బౌలర్లలో ఖలీల్ అహ్మద్, అక్షర్ పటేల్, ముకేశ్ కుమార్, కుల్దీప్ యాదవ్, స్టబ్స్ తలో వికెట్ తీశారు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా ఇషాంత్ శర్మ ఎంపిక అయ్యాడు.