జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అధికారం లోకి రావడానికి ఒక్కటంటే ఒక్క ప్రయత్నం కూడా చెయ్యలేదు. ఏదో ఒక పార్టికి ఊడిగం చెయ్యడానికి సరిపోయింది.
2014లో పెళ్లి చేసుకున్న టీడీపీతో 2016లో విడాకులు తీసుకుని వాళ్ళతో ఎడమొహం పెడమొహంగా ఉంటూ వచ్చారు. 2019లో సొంత కుంపట్లు పెట్టి ఇద్దరూ చేతులు కాల్చుకున్నారు. చేసేది ఏమీ లేక చేతులు కట్టుకుని కూర్చున్నారు.
చంద్రబాబు అరెస్టుతో పాత ప్రేమ గుర్తొచ్చి పవన్ కళ్యాణ్ రాజమండ్రి వెళ్లిపోయి 2024లో “మళ్ళీ పెళ్లి”కి నిశ్చితార్థం ఖాయం చేసుకుని వచ్చేసాడు. ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న సంబంధం కలవడంతో ఇటు టీడీపీ నాయకులు, జనసేన నాయకులు సంబరాలు చేసుకున్నారు. తమకు ఊడిగం చెయ్యడానికి జనసేన వస్తున్నందుకు ఒకింత టీడీపీ కార్యకర్తలు కూడా సంతోషించారు. కానీ ఎక్కువశాతం జనసేన కార్యకర్తలకు నచ్చలేదు. మొన్నటిదాకా టీడీపీ కార్యకర్తల చేతిలో తీవ్ర అవమానాలకు గురైన జనసేన కార్యకర్తలు సోషల్ మీడియా వేదికగా చాలా వ్యతిరేకత వ్యక్తం చేశారు. కళ్యాణ్ దిలీప్ సుంకర లాంటి వీరాభిమానులు కూడా లైవ్ వీడియోలు పెట్టి కన్నీళ్లు కార్చారు. ఆ విషయానికి వస్తే చీము, నెత్తురు ఉన్న ఎవ్వరైనా అలాగే స్పందిస్తారు.
పార్టీ పెట్టినప్పటి నుంచి తమ ఆస్తులు, పరువు పోగొట్టుకుని జనసేన వెనక నిలబడ్డ కార్యకర్తలను సముదాయించాల్సినది పోయి జనసేన నాయకుడు వాళ్లనీ అవమానిస్తున్నాడు. మొన్న పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ “జనసేన-టీడీపీ పొత్తు గురించి వ్యతిరేకించేవాళ్లు, విమర్శించేవాళ్లు వైసీపీ కోవర్టులు. అలాంటివాళ్లు ఎవరైనా ఉంటే బయటికి వెళ్లిపోవాలి” అని సూటిగా కుండబద్దలు కొట్టేశాడు.
కొద్దిగా వెనక్కి వెళితే పవన్ కళ్యాణ్ టీడీపీతో మొదటిసారి విడాకులు తీసుకున్న తర్వాత టీడీపీ వాళ్లు అతడిని అమానుషంగా తిట్టారు. అలా తిట్టిన వారిలో గోరంట్ల నుండీ లోకేష్ వరకూ దాదాపు ఇరవై మంది టీడీపీ నేతలు ఉన్నారు. ఇహ సాధినేని యామినీ అయితే పవన్ మల్లె పూలు పిసకడానికి తప్ప ఎందుకూ పనికిరాడని ఘోరంగా అవమానించింది.
పవన్ కళ్యాణ్ కూడా చంద్రబాబు, చింతమనేని, గోరంట్ల, టీజీ వంటి వారిని తిట్టడంతో పాటు తన తల్లిని దూషించిన లోకేష్ ని, టీడీపీని జీవితంలో క్షమించను అని పలు బహిరంగ సభల్లో ఆవేశంగా ప్రసంగించాడు. ఈ ప్రసంగాలు విన్న జన సైనికులు కూడా టీడీపీని తమ ఆగర్భ శత్రువుగా భావించడం టీడీపీ చర్యలకు వ్యతిరేకంగా స్పదించడం చేయశాగారు.
అందరూ ఊహించినట్టే మళ్ళీ పవన్ కళ్యాణ్ టీడీపీతో పొత్తు పెట్టుకొన్నా జనసేన శ్రేణులు మాత్రం ఇది జీర్ణించుకోలేకపోయారు. టీడీపీ వాళ్ళు నా తల్లిని తిట్టారు, నాకు పరిటాల గుండు కొట్టాడని ఇదే టీడీపీ వాళ్ళు ప్రచారం చేశారంటూ తన అభిమానులతో పవన్ మొర పెట్టుకొన్న తర్వాతే వారు టీడీపీని ద్వేషించింది. ఇప్పుడు అదే పవన్ తల్లిని తిట్టిన పార్టీతో పొత్తు పెట్టుకొంటే ఇదేం న్యాయం, ఇంత దిగజారడం ఎందుకు అనే ప్రశ్నలు సహజంగా వస్తాయి .
అలా ప్రశ్నించిన వారికి సమాధానం చెప్పకుండా తనని ప్రశ్నించేవారు వైసీపీ కోవర్థులనీ, వారు తన పార్టీ నుండీ వెళ్లిపోవాలని అనడం పవన్ అహంభావాన్ని, పార్టీ శ్రేణుల్ని, అభిమానుల్ని బానిసలుగా చూసే తత్వాన్ని సూచిస్తుంది.
తన అనైతిక చర్యల్ని ప్రశ్నించిన వారు కోవర్టులైతే తల్లిని తిట్టిన పార్టీతో పొత్తు పెట్టుకొన్న వాడిని ఆ తల్లి ఏమనాలి.