ఏపీలో పార్టీ ఫిరాయించిన ఇద్దరు ఎమ్మెల్సీలపై వేటు పడింది. ఎమ్మెల్సీలు వంశీ కృష్ణయాదవ్, సి. రామచంద్రయ్యలపై అనర్హత వేటు వేస్తున్నట్లు శాసన మండలి చైర్మన్ మోషేన్ రాజు ప్రకటించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్సీలుగా ఎన్నికైన వంశీకృష్ణ జనసేన పార్టీలోకి, సి.రామచంద్రయ్య టీడీపీలోకి వెళ్లారు. కాగా ఈ ఇద్దరు నేతలు వైఎస్సార్సీపీ నుండి ఎన్నికై ఇతర పార్టీలలోకి వెళ్లిన విషయంపై శాసన మండలి చీఫ్ విప్ మేరిగ మురళీధర్, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డిలు శాసనమండలి ఛైర్మన్ మోషేన్ రాజుకు పిర్యాదు చేశారు.
ఫిరాయింపు నిరోధక చట్టం కింద ఎందుకు చర్యలు తీసుకోకూడదో వివరణ ఇవ్వాలంటూ మండలి చైర్మన్ మోషేన్ రాజు పార్టీ ఫిరాయించిన నేతలకు నోటీసులు పంపి సమగ్ర విచారణ చేపట్టారు. విచారణ అనంతరం వంశీ కృష్ణయాదవ్, సి. రామచంద్రయ్యలపై వేటు వేస్తున్నట్లు శాసన మండలి చైర్మన్ మోషేన్ రాజు ప్రకటించారు.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారామ్ ఇటీవలే రెబల్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసిన విషయం తెలిసిందే. వైఎస్సార్సీపీ తరపున గెలిచి టీడీపీకి మద్దతు ప్రకటించిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రాంనారాయణరెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి, టీడీపీ తరపున గెలిచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపిన వల్లభనేని వంశీ, మద్దాళి గిరి, కరణం బలరాం, వాసుపల్లి గణేష్ లపై పార్టీ ఫిరాయించినందుకు అనర్హత వేటు వేయడంతో వారంతా తమ పదవులను కోల్పోయారు.