రెండు రోజుల క్రితం ఇంటర్ ఫలితాలను విడుదల చేసిన ఇంటర్మీడియట్ బోర్డ్, తదుపరి అంశమైన అడ్మిషన్ల ప్రక్రియ వేగవంతం చేసింది. గతం కంటే భిన్నంగా ఇప్పుడు అడ్మిషన్లు ప్రక్రియ జరుగుతుంది. విద్యార్థి విద్యార్థినీలు తాము చదవాలనుకునే కళాశాలలకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ప్రభుత్వం కాలేజీలకి కేటాయించిన సీట్లకి లోబడే అడ్మిషన్లను తీసుకోవాలని బోర్డు స్పష్టం చేసింది. మరి కొద్ది రోజుల్లోనే పదవ తరగతి ఫలితాలను కూడా వెల్లడించే పరిస్థితి ఉన్న నేపథ్యంలో అడ్మిషన్లు ప్రక్రియ వేగవంతం చేయాలని బోర్డ్ వేగంగా అడుగులు వేస్తోంది.
ఇంటర్మీడియట్ ఫస్టియర్, సెకండియర్ ప్రవేశాలకు దరఖాస్తుకు ఆహ్వానిస్తున్నట్లు ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి సౌరభ్ గౌర్ శనివారం ప్రకటించారు. 2023 – 24 విద్యా సంవత్సరానికి గాను ఇంటర్ పరీక్షా ఫలితాలు వెల్లడించిన ప్రభుత్వం తదుపరి 2024 – 25 విద్యా సంవత్సరంపై దృష్టిపెట్టింది.
ఇప్పటికే పదవ తరగతికి సంబంధించిన వాల్యుయేషన్ ప్రక్రియ ముగిసింది. త్వరలో ఫలితాలను కూడా వెల్లడించనున్నారు. ప్రభుత్వ కళాశాలల్లో ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరంలో ప్రవేశాలకు అవకాశం కల్పిస్తూ దరఖాస్తులను ఆహ్వానించింది.
ఇంటర్మీడియట్ అడ్మిషన్లను రెండు విడతలుగా చేపట్టాలని బోర్డ్ నిర్ణయించింది. మే 22న మొదటి ఫేజ్ అడ్మిషన్లను ప్రారంభించనున్నారు. జూన్ 1నాటికి ప్రక్రియ ముగియనుంది. అడ్మిషన్లు ప్రక్రియ ముగిసిన జూన్ 1 నుంచే ఇంటర్ ఫస్టియర్ తరగతులను ప్రారంభించనున్నారు.
జూన్ 10వ తేదీన సెకండ్ ఫేజ్ అడ్మిషన్ల ప్రక్రియను ప్రారంభిస్తారు. జులై 1 నాటికి సెకండ్ ఫేజ్ అడ్మిషన్ల ప్రక్రియ ముగియనుంది. ఈ మేరకు అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ఎయిడెడ్, ఏపీ రెసిడెన్షియల్, ఏపీ మోడల్, హైస్కూల్ ప్లస్ తదితర కళాశాల ప్రిన్సిపల్స్ ఇంటర్మీడియట్ బోర్డు గైడ్లైన్ను అనుసరిస్తూ, నిబంధనల ప్రకారం రిజర్వేషన్ విధానాన్ని పాటిస్తూ అడ్మిషన్ల ప్రక్రియను నిర్వహించాలని కార్యదర్శి సౌరభ్ గౌర్ పేర్కొన్నారు. దరఖాస్తు చేసకునే అభ్యర్థులు ఫస్టియర్, సెకండియర్కు సంబంధించి అందుబాటులో ఉన్న జనరల్, ఒకేషనల్ కోర్సుల వివరాలను జన్మభూమి పోర్టల్ వెబ్సైట్ ద్వారా తెలుసుకోవచ్చన్నారు.