ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. విజయవాడలోని బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియెట్ ఎడ్యుకేషన్ కార్యాలయంలో ఇంటర్ ఫస్టియర్తో పాటు సెకండియర్ ఫలితాలను అధికారులు విడుదల చేశారు.. ఈ సారి రెండు సంవత్సరాల ఇంటర్ పరీక్షలకు 9,99,698 మంది విద్యార్ధులు హాజరు కాగా ఇంటర్ ఫస్టియర్ ఫలితాల్లో 67 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు.. ఇంటర్ సెకండియర్ ఫలితాల్లో 78 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు.
కాగా ఇంటర్ ఫలితాలలో కృష్ణా జిల్లా విద్యార్థులు మంచి ఫలితాలు సాధించడంతో అగ్ర స్థానంలో నిలిచి సత్తా చాటింది. ఫస్టియర్ ఫలితాల్లో 84 శాతం ఉత్తీర్ణతతో కృష్ణా జిల్లా తొలి స్థానంలో నిలిచింది. సెకండియర్ ఫలితాల్లోనూ 90 శాతం ఉత్తీర్ణతతో కృష్ణా జిల్లా సత్తా చాటి ప్రథమ స్థానంలో నివలడం గమనార్హం.. కృష్ణా తరువాతి స్థానంలో 81 శాతం(ఫస్ట్ ఇయర్) 87 శాతం(సెకండ్ ఇయర్) ఉత్తీర్ణతతో గుంటూరు నిలిచింది. 79 శాతం ఉత్తీర్ణతతో మూడో స్థానంలో ఎన్టీఆర్ జిల్లా నిలిచింది.
ఈసారి కూడా బాలుర ఉత్తీర్ణత శాతం కంటే బాలికల ఉత్తీర్ణత శాతం ఎక్కువగా ఉండటం గమనార్హం. ఈనెల 18 నుంచి 24వ తేదీ వరకు రీవాల్యుయేషన్కు అవకాశం కల్పించారు. తమ మార్కులపై అనుమానం ఉన్న విద్యార్థులు రీ వ్యాల్యూయేషన్ కు అప్లై చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులు తొందరపాటు చర్యలకు పాల్పడకుండా సప్లిమెంటరీ పరీక్షలు రాసి మంచి ఫలితాలు సాధించాలని ఏపీ ఇంటర్ బోర్డు కార్యదర్శి సౌరబ్ గౌర్ తెలిపారు.