ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల ప్రచారం రోజు రోజుకు పుంజుకుంటోంది. ఒక వైపు అధికార వైసీపీతాను చేసిన సంక్షేమం, అభివృద్దిని చూసి ఓటు వేయమని చెబుతోంది. అలాగే ప్రతి పక్ష నేతపై కూడా పదునైన పదజాలం ఉపయోగించకుండా తన 14 ఏళ్ల పాలనలో ఎప్పుడైనా ఇలాంటి హామీలు అమలు చేశారా అని ప్రశ్నిస్తూ ప్రజల్లోకి వెళ్తున్నారు సీఎం జగన్. అయితే టీడీపీ కూడా ధీటుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంటే సంక్షేమ పథకాలు అధికంగా ఇస్తామంటూ ప్రచారం చేస్తున్నారు. కానీ టిడిపి తన 14 ఏళ్ల హయాంలో ఫలానా మంచి చేశాం అని చెప్పుకోలేని స్థితిలోకి వెళ్లిపోయింది.
2024 సార్వత్రిక ఎన్నికల పోలింగ్ కి మరో వారం రోజులు కూడా లేదు. రాష్ట్రంలోని అన్ని పార్టీల నేతలు జోరుగా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇవాళ మూడు నియోజకవర్గాల్లో ప్రచారం చేయనున్నారు. ఉదయం 10 గంటలకు రాజమహేంద్రవరం లోక్‌సభ పరిధిలోని రాజానగరం నియోజకవర్గంలోని కోరుకొండ జంక్షన్లో జరిగే ప్రచార సభకు హాజరవుతారు. మధ్యాహ్నం 12.30 గంటలకు శ్రీకాకుళం పార్లమెంట్ పరిధిలోని ఇచ్చాపురం పట్టణం మున్సిపల్ ఆఫీస్ సెంటర్ లో జరిగే సభలో పాల్గొంటారు. మధ్యాహ్నం 3 గంటలకు విశాఖపట్నం పార్లమెంట్ పరిధిలోని గాజువాక నియోజకవర్గంలో పాత గాజువాక సెంటర్లో జరిగే ప్రచార సభకు వెళ్తారు.
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఇవాళ చిత్తూరు జిల్లా పుంగనూరు ప్రజాగళం సభలో పాల్గొంటారు. సాయంత్రం తిరుపతిలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌తో కలిసి ప్రజాగళం సభలో పాల్గొంటారు. నారా లోకేష్ తలపెట్టిన యువగళం ప్రచార సభలకు బ్రేక్ పడింది.