రాష్ట్ర వ్యాప్తంగా నిన్న పదో తరగతి పరీక్షలు పూర్తి అయ్యాయి. పరీక్షలు పూర్తి అవుతున్న సమయంలో రాయదుర్గంలో ఒక ఆసక్తికర సంఘటన జరిగింది. పదవ తరగతి పరీక్షలు పూర్తిచేసుకుని బయటికి వస్తున్న విద్యార్థులకు ఇంటర్ తమ కళాశాలలో జాయిన్ కావాలని రాయదుర్గం గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్, అధ్యాపకులు వినూత్న ప్రచారం చేపట్టారు. పదో తరగతి పూర్తి చేసుకున్న విద్యార్థులకు తమ కళాశాలలో చేరండి మీకు అనుభవజ్ఞులైన అధ్యాపకులచే మంచి బోధనను చేస్తామని ప్రిన్సిపాల్ తెలిపారు.
గతంలో ఇలా కార్పొరేట్ కాలేజ్ సంస్థలు ఈ రకమైన ప్రచారం చేసేవారు. గతంతో భిన్నంగా ప్రభుత్వ కళాశాల అధ్యాపకులు ప్రభుత్వ కళాశాలలో చేరండి ఉన్నత భవిష్యత్తు కల్పిస్తాం అంటూ ప్రచారం చేయడం బహుశా మొదటిసారి కావచ్చు. మా కళాశాలలో చేరండి, అనుభవజ్ఞులైన అధ్యాపకులతో నాణ్యమైన బోధన అందిస్తాం. ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేస్తాం అంటూ రాయదుర్గం పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల అధ్యాపకులు ప్రచారం చేస్తుండడం ఆకట్టుకుంటోంది. 2024-25 విద్యా సంవత్సరంలో అడ్మిషన్ల సంఖ్య పెంచుకోవడంలో భాగంగా అధ్యాపకులు ప్రచారానికి శ్రీకారం చుట్టారు. మంగళవారం పట్టణంలో పదో తరగతి పరీక్షలు జరుగుతున్న 6 కేంద్రాల వద్దకు వెళ్లి విద్యార్థులకు కరపత్రాలను పంపిణీ చేశారు. చాక్లెట్లు సైతం పంపిణీ చేసి ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ వీరేష్ మాట్లాడుతూ విద్యార్థులు ప్రైవేటు కళాశాలల వైపు దృష్టి సారించకుండా ఉండడానికి ఇప్పటి నుంచే ప్రచారం చేస్తున్నట్లు చెప్పారు.
గతానికి, ప్రస్తుతానికి ప్రభుత్వ కళాశాలల్లో వసతులు మెరుగయ్యాయని, అధ్యాపకులు సంఖ్య కూడా పెరిగిందన్నారు. హాస్టల్ వసతి,సౌకర్యాలు, దూరప్రాంత విద్యార్థులకు ఆర్టీసీ బస్సు సౌకర్యం, రోజూ స్టడీ అవర్స్ అందుబాటులో ఉన్నాయన్నారు. తమ కళాశాలలో చేరి భవితకు బంగారు బాటలు వేసుకోవాలని సూచించారు.
జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ బడులు, కళాశాలలో పెను మార్పులు చోటు చేసుకున్నాయి. గతంలో ప్రభుత్వ బడులు, ప్రభుత్వ కళాశాలలలో విద్యార్థులు చేరాలంటే అయోమయం పరిస్థితిలో ఉండేవారు. నేడు జూన్ మాసం రాగానే ప్రభుత్వ బడుల్లో ఖాళీ సీట్లు లేవు అని బోర్డులు బయట కనబడుతున్నాయి.