గచ్చిబౌలి రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసు ఊహించని మలుపులు తిరుగుతుంది. గచ్చిబౌలిలోని రాడిసన్ హోటల్లో డ్రగ్స్ ను వినియోగిస్తున్నట్లు ఆదివారం రాత్రి సమాచారం అందడంతో పోలీసులు రాడిసన్ హోటల్‌పై దాడి చేసి ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకుని వారి వద్ద పెద్ద మొత్తంలో కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. కాగా ఈ వ్యవహారంపై పోలీసులకు ముమ్ముర దర్యాప్తు చేపట్టడంతో పలువురు సెలెబ్రిటీల పేర్లు వెలుగులోకి వచ్చాయి. వీరిలో టాలీవుడ్ బడా డైరెక్టర్ క్రిష్ పేరు కూడా ఉండడం గమనార్హం.
కాగా రాడిసన్ హోటల్లో బీజేపీ నేత కుమారుడు గజ్జల వివేకానంద నిర్వహించిన పార్టీలో కొకైన్ విక్రయించిన అబ్బాస్ అలీని అదుపులోకి తీసుకున్న పోలీసులు అబ్బాస్ ఆలీ నుండి కీలక విషయాలను రాబట్టారు. వ్యాపారవేత్త కేదార్‌నాథ్‌తో పాటు డ్రగ్స్ పార్టీకి లిషి గణేష్ వెళ్లినట్లు తెలియడంతో ఆమె పేరును కూడా ఎఫ్ఐఆర్లో చేర్చారు. ఆదివారం రాత్రి పార్టీ జరిగిన రూమ్‌లో క్రిష్ అరగంట పాటు ఉన్నారని తేలడంతో ఆయన 8 వ నిందితుడిగా ఎఫ్ఐఆర్లో చేర్చారు. గతంలో పలు సూపర్ హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించిన క్రిష్ పేరు డ్రగ్స్ కేసులో బయట పడటం ఇప్పుడు తెలుగురాష్ట్రాల్లో సంచలనంగా మారింది.
డ్రగ్స్ పార్టీలో క్రిష్, సందీప్, నిర్భయ్, నీల్, కేదార్, లిషి గణేష్, శ్వేత, రఘుచరణ్‌లు పాల్గొన్నట్లు పోలీసులు గుర్తించడంతో వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వివేకానంద పార్టీలకు క్రిష్ రెగ్యులర్ గా వస్తున్నట్లు సమాచారం. టాలీవుడ్ లో సందేశాత్మక చిత్రాలను విభిన్నంగా తీసే దర్శకుడిగా పేరు పొందిన క్రిష్ గమ్యం, వేదం, కంచె, కృష్ణం వందే జగద్గురుమ్, గౌతమి పుత్ర శాతకర్ణి లాంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. తాజాగా పవన్ కళ్యాణ్ తో హరిహర వీరమల్లు చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. డ్రగ్స్ కేసు వ్యవహారంపై క్రిష్ నుండి ప్రకటన రావాల్సి ఉంది.