హైదరాబాద్ బెంగుళూరు జాతీయ రహదారిపై గద్వాల జిల్లాలో ఘోర బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఒక మహిళ సజీవ దహనం కాగా మరో పది మందికి గాయాలయ్యాయి. క్షత్రగాత్రులను కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా మృతిచెందిన మహిళ వివరాలు తెలియాల్సి ఉంది.
హైదరాబాద్ నుండి చిత్తూరు వెళ్తున్న వోల్వో బస్ గద్వాల జిల్లా మానవపాడు మండలం ఎర్రబెల్లి చౌరస్తా పదవ బెటాలియన్ సమీపంలో అదుపు తప్పి బస్సు బోల్తా పడింది. ఇంజన్ లోనుండి మంటలు చెలరేగడంతో ప్రయాణికులను డ్రైవర్ అప్రమత్తం చేయడంతో ప్రయాణికులు అద్దాలు పగలగొట్టుకుని బయటకు వచ్చే ప్రయత్నం చేశారు. ప్రమాద సమాచారం అందుకున్న ఎన్ హెచ్ఏఐ పెట్రోలింగ్ సిబ్బంది ప్రయాణికులను రక్షించే ప్రయత్నం చేశారు.
మంటలు వేగంగా వ్యాపించడంతో బస్సులో ఇరుక్కుపోయిన మహిళను బయటకు తీయడం సాధ్యం కాలేదు. దీంతో ఆ మహిళ సజీవదహనమైంది. ఈ ఘటనలో పది మందికి గాయాలు కాగా వారిలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన వారిని కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించగా స్వల్ప గాయాలైన వారికి గద్వాల ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అతివేగమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణంగా గుర్తించారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 34 మంది ఉన్నట్లు సమాచారం.