బీఆర్ఎస్ నేత సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. పటాన్చెరు నుంచి మేడ్చల్ వెళ్తున్న క్రమంలో సుల్తాన్పూర్ వద్ద శుక్రవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కారు అదుపు తప్పి డివైడర్‌ను ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. కారులో వెనుక సీట్ లో ప్రయాణిస్తున్న లాస్య నందిత అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటనతో బీఆర్ఎస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది.
పదిరోజుల క్రితం అనగా ఈ నెల 13న కూడా ఆమె కారు ప్రమాదానికి గురవడం గమనార్హం. కేసీఆర్ బహిరంగ సభకు హాజరై తిరిగి వస్తున్న క్రమంలో ఆమె ప్రయాణిస్తున్న కారు రోడ్డుపక్కకు దూసుకెళ్లటంతో ఓ హోంగార్డు మృతి చెందాడు. ఈ ప్రమాదంలో లాస్య నందిత స్వల్పగాయాలతో బయటపడిన పదిరోజుల్లోనే మరో రోడ్డు ప్రమాదంలో ఆమె ప్రాణాలు కోల్పోవడం విచారానికి గురి చేస్తుంది. ప్రమాద వార్త తెలిసిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని ప్రమాద ఘటనపై దర్యాప్తు చేపట్టారు.
తండ్రి సాయన్న కోరిక మేరకు లాస్య నందిత రాజకీయాల్లోకి వచ్చిన 2016 జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కార్పొరేటర్‌గా ఎన్నికయ్యారు. కాగా గత సంవత్సరం ఫిబ్రవరి 19న ఆమె తండ్రి ఎమ్మెల్యే సాయన్న అనారోగ్యంతో మరణించడంతో లాస్య నందితకు కేసీఆర్ సికింద్రాబాద్ కంటోన్మెంట్ టికెట్ కేటాయించారు. గత ఏడాది డిసెంబర్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన లాస్య నందిత ఎన్నికైన మూడు నెలలకే ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదంగా చెప్పవచ్చు. కాగా డ్రైవర్ నిద్రమత్తు, ఓవర్ స్పీడ్ కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉడొచ్చని పలువురు భావిస్తున్నారు.