దారిపొడవునా చలికి మెల్లిగా ఊగుతూ ఊదారంగు పూలు.
ఆకాశంలోనూ ఊదాల గుత్తులు.
పై అరల్లో కుక్కేసిన చలికోట్లన్నీ అరుంధతిలో పశుపతిలా బయటపడే నెల.
పాలబ్బాయి చారల బనీను చిల్లుల్ని చూస్తే పాత కోటొకటి దానమివ్వాలనిపించే పుణ్యమాసం.
ఆరవుతున్నా ఆవులిస్తూ బద్ధకంగా దళసరి మబ్బునొకదాన్ని మీదకి లాక్కుని అటుతిరిగి పడుకునే సూర్యుడు.
‘ఈ చల్లో అరవకపోతేనేం?’ అంటూ గోపురాలెక్కి మూతిముడుచుకునే పావురాలు.
ముదురు కుంకం రంగు ఊలు తొడుగుల మధ్యన బంగారంలా మెరిసే బడిపిల్లల మొహాలు.
రాంబద్దర్రాజుగారికి గాష్ట్రిక్కున్నా సరే వాకింగులో తాగక తప్పని ఉదయంపు టీ.
డబ్బున్న మేడలముందు దుక్కల్లాటి కాలిపట్టాల మీద వెచ్చగా నిదరోయే టామీలు.
గుడిపక్కనున్న డ్రైనేజి గొట్టంలో చలికి దాక్కున్న మా వీధి జిమ్మీ.
పంతులు గంట కొట్టంగానే ఇహ మనల్ని అమ్మనుంచి తెంపుకుపోతాడన్న నైరాశ్యంలో నందివర్ధనాలు.
డిసెంబరంటే చలికోసం పెట్టుకునే దరఖాస్తు.
చలికాలపు ఉదయాలు బావుంటాయి. నాకిష్టం!
– కొచ్చెర్లకోట జగదీశ్
Tags :