క్రిస్టోఫర్ నోలాన్.. సినీ అభిమానులకు పరిచయం అక్కరలేని పేరు.. మెమెంటో, ఇంటర్ స్టెల్లార్, ఇన్సెప్షన్, ది డార్క్ నైట్, డంక్రిక్ లాంటి పలు విభిన్న చిత్రాలతో ప్రేక్షకుల మనుసును దోచుకున్నారు. ప్రేక్షకుల మెదళ్ళకు పదును బెట్టే విధంగా సినిమాలు సంక్లిష్టమైన సినిమాలు తీసే దర్శకుడిగా పేరున్న ఆయనకు ఇప్పటి వరకూ ఆస్కార్ అందని ద్రాక్షగా మిగిలిపోయింది. ఎట్టకేలకు ఆస్కార్ అవార్డు క్రిస్టోఫర్ నోలన్ కి దక్కడంతో సినీ ప్రియులు ఆనందం వ్యక్తం చేస్టున్నారు. 96వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవంలో ఓపెన్ హైమర్ చిత్రానికి గానూ ఆయన ఉత్తమ దర్శకుడిగా అవార్డు అందుకున్నారు. ఓపెన్ హైమర్ సినిమాకు ఏకంగా ఏడు అవార్డులు రావడం విశేషం.
లాస్ ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్లో 96వ ఆస్కార్ అవార్డుల వేడుక ఘనంగా జరిగింది. ఏడు అవార్డులు కొల్లగొట్టిన ఓపెన్ హైమర్ ఈ ఏడాది అత్యధిక ఆస్కార్లు గెలిచిన సినిమాగా రికార్డ్ సృష్టించింది. ఓపెన్‌హైమర్‌తో పాటు పూర్ థింగ్స్ చిత్రానికి నాలుగు విభాగాల్లో అవార్డులు దక్కడం గమనార్హం. కాగా 96 వ ఆస్కార్ అవార్డుల్లో భారతీయ సినిమాలకు ఏ అవార్డు దక్కలేదు.